Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులను విమర్శించే అర్హత ఆయనకు లేదు
- పోరాటం చేయలేక అమ్ముడుపోయిన వ్యక్తి
- వ్యాపారం కోసం నీడనిచ్చిన కాంగ్రెస్‌ని ముంచిండు
- బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ..అందుకే టీఆర్ఎస్కు మద్దతు
- మాబలంతో ఓడించలేం కాబట్టే పోటీచేయలేదు
- నవతెలంగాణతో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'రాజగోపాల్‌రెడ్డే పెద్ద 420. మూడేండ్ల నుంచి బీజేపీతో టచ్‌లో ఉన్నానని ఆయనే చెప్పిండు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఓకే కావడంతోనే బీజేపీలో చేరాడు. ఉప ఎన్నిక తెచ్చాడు. నిజంగా ప్రజల కోసమే అయితే సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి కొట్లాడేటోడు. మూడున్నరేండ్లలో ఏనాడూ ఆ పని చేయలేదు. అమ్ముడుపోయిండు. కమ్యూనిస్టులెప్పుడూ సిద్ధాంతపరంగానే ముందుకెళ్తారనే విషయాన్ని రాజగోపాల్‌రెడ్డి మరవొద్దు. మేం మొదటి నుంచీ బీజేపీ విధానాలపై పోరాడుతున్నాం. అమ్ముడుపోయే అలవాటు, ఓట్లను, ఎమ్మెల్యేలను కొనుక్కునే అలవాటు కమ్యూనిస్టులకు లేదు. వ్యాపారాల కోసం రాజకీయాలు చేసే అలవాటు కోమటిరెడ్డిదే. కమ్యూనిస్టులు సైద్ధాంతిక, రాజకీయ విలువల కోసం కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనటం తప్ప ఇలా చేయరు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీచేయడం, ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. మునుగోడులో కమ్యూనిస్టుల ఓట్లు చీలకుండా ఉండాలనే బీజేపీపై కొట్లాడుతున్న టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం. కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం' అని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. 'టీఆర్ఎస్ అనురిస్తున్న విధానాలపైనా, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్లపైనా కమ్యూనిస్టులుగా నిక్కచ్చిగా పోరాడుతాం. ఎన్నికలు వేరు. పోరాటాలు వేరు' అని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న : అభివృద్ధి కోసమే ఉప ఎన్నిక అంటున్న రాజగోపాల్‌రెడ్డి మాటల్లో వాస్తవమెంత?
జవాబు : అభివృద్ధి కోసమనేది ఒట్టిమాటే. మన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు చనిపోయిన సందర్భాల్లో కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు, తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఉప ఎన్నికలొచ్చాయి. కానీ, ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నిక ఓ రాజకీయ పార్టీ అధికార దాహం, ఓవ్యక్తి వ్యాపార విస్తరణ స్వార్ధం కోసమే అనేది సుస్పష్టం. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాననీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వట్లేదని రాజగోపాల్‌రెడ్డే చెప్పాడు. మరోవైపు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించారని ఆయనే చెబుతున్నాడు. పోనీ, ఆయన చెప్పిందే నిజమైతే, రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచిగానీ, ఇండిపెండెంట్గానీ పోటీచేస్తే ప్రజలు ఆదరించేవారేమో! ఆయన బీజేపీకి పోయి పోటీ చేస్తున్నడు. తెలంగాణలో ఓ పార్టీ ఎదుగుదల కోసం తనను పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచాడు.
గెెలిపిస్తే నెలన్నరలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తమంటున్నడు దీనిపై మీ అభిప్రాయమేంటి?
మునుగోడులో బీజేపీని గెలిపిస్తే నెలన్నరలోపే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అమిత్‌షా చౌటుప్పల్ సభలో చెప్పడాన్ని బట్టే ఇది అధికార దాహంలో భాగంగా వచ్చిన ఉప ఎన్నిక అనేది సుస్పష్టం. బీజేపీ చేతిలో రాజగోపాల్‌రెడ్డి ఓ పావు. ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చేయడం, మతంతో రాజకీయం చేసే బీజేపీ విధానమే అనైతికం. మునుగోడులో డబ్బుల మూటలతో రాజకీయం చేయాలని చూశారుగానీ వారి పప్పులు ఉడకట్లేదు.
కమ్యూనిస్టులు టీఆర్ఎస్ను ఎందుకు బలపరుస్తున్నారు? దీనిపై వస్తున్న విమర్శలకు మీ సమాధానమేమి?
బీజేపీ దేశంలోని అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేస్తూ పోతున్నది. ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి, కొని ప్రభుత్వాలను కూల్చేసే బీజేపీ అప్రజాస్వామ్య పద్ధతిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో చూశాం. ఒకే భాష, ఒకే పన్ను, ఒకే సంస్కృతి పేరుతో దేశ సమగ్రతకు దెబ్బతీసేలా బీజేపీ ఎత్తుగడలను అనుసరిస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని చీల్చానుకోవడం దుర్మార్గం. ఇలాంటి ధోరణిని అడ్డుకట్ట వేయడంలో కమ్యూనిస్టులుగా ముందు వరుసలో ఉంటాం.
మునుగోడును అభివృద్ధి చేస్తమని బీజేపీ నేతలు అంటున్నరు..దీన్ని ఎలా చూడాలి?
రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి ఇది చేస్తాం..అది చేస్తాం అనే విషయాన్ని అమిత్ షా బహిరంగ సభలో ఎక్కడా చెప్పలేదు. ఎనిమిదేండ్ల కాలంలో బీజేపీ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేదు. బీజేపీ తన పాలిత రాష్ట్రాల్లోనే అభివృద్ధి అంతంత మాత్రమే. మానవాభివృద్ధి సూచికలో, అభివృద్ధిలో బీజేపీయేతర రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనుకబడ్డాయి. ఇక్కడ ఏదో చేస్తారని ఆశించడం పొరపాటే.
క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్తో కమ్యూనిస్టులు అంతగా కలవట్లేదనే కాంగ్రెస్, బీజేపీ ప్రచారంపై మీ సమాధానమేమి?
ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విష ప్రచారం. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలోనూ టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులతో సమన్వయ కమిటీలు వేసుకుని సమిష్టిగా ముందుకు సాగుతున్నారు. బూతు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసుకుని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. కమ్యూనిస్టులు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం మునుగోడు. పోరాటల గడ్డ. రాజకీయ చైతన్యం ఎక్కువ. అందుకే, ఇక్కడ బీజేపీ ఆటలు, నాటకాలు సాగట్లేదు. ఈ నేపథ్యంలోనే విషప్రచారానికి తెరలేపింది.
రాజకీయ లబ్ది కోసం తరుచూ వస్తున్న ఉప ఎన్నికలపై మీ కామెంట్?
పార్టీలు కొన్నిసార్లు అధికారంలో ఉండొచ్చు..మరికొన్ని సార్లు దూరం కావొచ్చు. అధికారం పోగానే పార్టీలు మారేటోళ్లు ఎక్కువైపోవటం ప్రమాదకరం. రాజగోపాల్‌రెడ్డి లాంటి వ్యాపారవేత్తలు తమ స్వప్రయోజనాల కోసం రాజకీయ వ్యవస్థను ఆగం చేస్తున్నారు. డబ్బులతో రాజకీయక్రీడ ఆడాలని చూస్తున్నరు. ఉప ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగ సమయం, ప్రజాధనం వృథా అవుతున్నాయి. ఇవి ఎన్నికల వ్యవస్థనే కలుషితం చేస్తున్నాయి. బూర్జువా పార్టీల విపరీతంగా ఖర్చుపెడుతూ ఎన్నికలంటే అసహ్యం కలిగేలా చేస్తున్నాయి. ప్రజా సేవ చేసేవారు రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నాయి. ఇది సమాజానికి మంచిదిగాదు. నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదు. ఇలాంటివి ఎల్లకాలం సాగవు. రాజగోపాల్‌రెడ్డి లాంటి వారికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయి.