Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించండి
- ఎన్నికల తర్వాత నేనే పీసీసీ అధ్యక్షుడ్ని అవుతా...
- పాదయాత్ర చేస్తా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తది :
మునుగోడు ఓటరుతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నికల వేళ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ 'కోవర్ట్' రాజకీయాలు బయటపడుతున్నాయి.. చచ్చేవరకు కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే.. బీజేపీలో ఉన్న తమ్ముడి కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. మొదటి నుంచి కోవర్ట్ అంటూ ప్రచారం జరుగుతున్నా స్పందించని వెంకట్‌రెడ్డి.. తాజాగా తన తమ్ముడికి ఓటేసి గెలిపించాలనడంతోపాటు ఈ దెబ్బతో తానే పీసీసీ అధ్యక్షుడినవుతానంటూ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న నాయకుడు పార్టీ అప్పగించిన బాధ్యతను విస్మరించడమే కాకుండా.. మరో పార్టీలోకి మారిన తన తమ్మున్ని గట్టెక్కించుకునేందుకు ప్రయత్నించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటరుతో ఎంపీ వెంకటరెడ్డి ఫోన్ సంభాషణ
'భాయ్.. తమ్ముడు రాజగోపాల్‌కు ఈ ఎన్నికలలో పార్టీలకు అతీతంగా సాయం చేయండి. మీ ఇంట్ల పెండ్లిండ్లకు, పేరంటాలకు, సచ్చిన.. బతికినా.. పిల్లల చదువులకు సాయం చేస్తుంటడు.. ఎన్నికల తర్వాత నేనే పీసీసీ అవుతా.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది. అప్పుడు మీకు నేను అన్నీ చూసుకుంటా..'' అంటూ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో ఫోన్లో సంభాషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తమ్ముడైన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
దీవించిన 'చెయ్యి' హాండిచ్చే..
నాలుగు రోజుల కిందట ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా గాంధీభవన్‌లో ఓటు వేయడానికి వెళ్లిన కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని దీవించారు. కానీ దీవించిన చెయ్యే ఇప్పుడు హ్యాండిచ్చింది. నియోజకవర్గంలోనే గాకుండా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. తల్లిపాలు తాగి రొమ్మును గుద్దేలా వెంకట్‌రెడ్డి వ్యవహారం ఉందని, వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోవర్టు 'రెడ్డి' నిజమే కదా..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటూ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, బీజేపీ పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారని ఈ మధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించా రు. కేటీఆర్ మాటలకు ఒంటికాలిపై లేచిన వెంకట్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారో చూడాలి మరీ.