Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ అఫిడవిట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్థానికత పేరుతో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేసిన ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు తనను క్షమించాల్సిందిగా టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అఫిడవిట్ దాఖలు చేశారు. జస్టిస్ ధర్మాధికారి నివేదికను కూడా అమలు చేయలేకపోయామనీ, న్యాయస్థానం ఆదేశాలతో తప్పులను సవరించుకుంటామనీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది ఆదేశాల అమల్లో భాగంగా ఇప్పటికే టీఎస్‌ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న 35 మంది రిలీవ్ అయిన ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్స్ ఇచ్చి, వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాల నిమిత్తం మొత్తం రూ.11 కోట్ల 65 లక్షల 10వేల 485 డిపాజిట్ చేశామనీ, టీఎస్ ట్రాన్స్‌కోకు చెందిన 29 మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలకు చెందిన రూ.8 కోట్ల 54 లక్షల 32వేల 526 జమ చేశామనీ అఫిడవిట్లో తెలిపారు. మరో 20 మంది ఉద్యోగులు డిస్కంలకు చెందినవారనీ, వారి కేసుల్లో ప్రత్యేకంగా మరో అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలిపారు. న్యాయస్థానం అదేశాలను తప్పకుండా అమలు చేస్తామని దానిలో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు.