Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం నిర్ణయించాలి : ఆర్టీసీ చైర్మెన్
- ఉమ్మడి విలేకరుల సమావేశ ప్రతిపాదన తిరస్కరించిన కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన రెండు వేతన సవరణలకు సంబంధించి సంస్థ వద్ద డబ్బులు లేవనీ, దాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. శుక్రవారం బస్‌భవన్‌లో ఆయన టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నాయకులతో భేటీ అయ్యారు. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్, కన్వీనర్ వీఎస్ రావు, పీ కమాల్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను జేఏసీ ప్రతినిధులు చైర్మెన్ ఎదుట ప్రతిపాదించారు. ప్రధానంగా కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు, సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతి, సీసీఎస్‌కు బకాయిలు చెల్లింపులు వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే వాటిపై తానేమీ హామీ ఇవ్వలేననీ, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే కార్మికులకు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించే ప్రకటన చేస్తామనీ, దానిలో జేఏసీ నేతలు కూడా భాగస్వాములు కావాలని చైర్మెన్ కోరారు. ఎలాంటి కచ్చితమైన హామీ లేకుండా తాము ఉమ్మడి విలేకరుల సమావేశంలో పాల్గొనబోమని జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. దీనితో ప్రభుత్వం టీఎమ్‌యూ (థామస్‌రెడ్డి వర్గం)ను పక్కన కూర్చోబెట్టుకొని ప్రకటనలు చేసింది.
నేడు అత్యవసర భేటీ
యాజమాన్యం చేసిన ప్రకటనలపై కార్మిక సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్టు ప్రకటన చేసింది. అలాగే మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య అత్యవసర సమావేశాన్ని ఆదివారం చౌటుప్పల్‌లో నిర్వహిస్తున్నట్టు పేర్నొన్నారు.