Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న డీఏవీ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనను ఏఐడీఎస్వో తీవ్రంగా ఖండించింది. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐడీఎస్వో అధ్యక్షులు ఎం నితీశ్, కార్యదర్శి ఎస్ సృజన్ మాట్లాడుతూ ఆ పాఠశాలలో రెండునెలలుగా ఈ అమానుషమైన ఘటన జరిగినా పట్టించుకోకపోవడం ప్రిన్సిపాల్ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆ డ్రైవర్‌పై పిల్లల తల్లిదండ్రులు అనేకసార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. డ్రైవర్ రజనీకుమార్‌ను కఠినంగా శిక్షించాలనీ, ప్రిన్సిపాల్ మాధవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి స్కూల్లోనూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల సినిమాలు, సాహిత్యం, పోర్నోగ్రఫీ, మద్యం, మాదక ద్రవ్యాలను నిషేధించాలని డిమాండ్ చేశారు.