Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఎంఎంటీసీకి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించిన ముసద్దిలాల్ జువెలర్స్ యజమాని సుకేశ్ గుప్తాను తొమ్మిది రోజుల పాటు విచారించటానికి ఈడీ కస్టడీకిస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎంటీసీ నుంచి తప్పుడు ధ్రువపత్రాలు, హామీలతో 190 కోట్ల రూపాయల మేరకు నగలను ఖరీదు చేసిన సుకేశ్ గుప్తా దానికైన రుణాన్ని ఎంఎంటీసీకి చెల్లించటంలో విఫలమైన విషయం తెలిసిందే.
అంతేగాక, వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద తన రుణాన్ని చెల్లిస్తానంటూ సుకేశ్ గుప్తా ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోక మోసానికి పాల్పడ్డట్టు ఈడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మూడ్రోజుల క్రితం ముసద్దిలాల్ జువెలర్స్‌కు చెందిన హైదరాబాద్, విజయవాడ, గుంటూరులలోని కార్యాలయాలపై దాడులు జరిపి రూ. 149 కోట్ల విలువైన నగలను ఈడీ స్వాధీనం చేసుకున్నది. అలాగే, రూ. 1.98 కోట్ల నగదు స్వాధీనపర్చుకున్నది. కాగా, సుకేశ్ గుప్తా ఎంఎంటీసీ నుంచి తీసుకున్న కోట్లాది రూపాయల నగలను దేశవిదేశాల్లో విక్రయించి భారీ మొత్తంలో లాభాలను గడించినట్టు ఈడీకి సమాచారమున్నది. అయితే, ఈ డబ్బును సుకేశ్ గుప్తా ఎక్కడ పెట్టాడన్నది తేల్చటానికి తదుపరి విచారణ కోసం కస్టడీకి తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈనెల 27 నుంచి నవంబర్ 2 వరకు సుకేశ్ గుప్తాను ఈడీ విచారించనున్నది. ఈ విచారణలో ఎలాంటి నిజాలను ఈడీ బయటపెడ్తుందో వేచి చూడాలి.