Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ అడ్వాన్స్, డిఏ బకాయిలు ఇస్తాం
- సకల జనుల సమ్మెనాటి వేతనాలు కూడా...
- 1,150 కొత్త బస్సులు కొంటాం : టీఎస్ఆర్టీసీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాల డిమాండ్లలో కొన్నింటిని నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. సుదీర్ఘకాలంగా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు ఎలాంటి పండుగ అడ్వాన్సులు చెల్లించని విషయం తెలిసిందే. అయితే ఈసారి దీపావళి పండుగను పురస్కరించుకొని అర్హులైన ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ ఇస్తున్నామనీ, దానికోసం రూ.20 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వచ్చే నెల మొదటి జీతంలో ఈ పండుగ అడ్వాన్సును కలిసి ఇస్తామన్నారు. శుక్రవారంనాడిక్కడి బస్‌భవన్‌లో కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ప్రకటనలు చేశారు. 2019 నుంచి ఆర్టీసీ కార్మికులకు ఐదు డిఏలు రావల్సి ఉండగా, వాటిలో మూడు చెల్లిస్తామనీ, దానికోసం రూ.15 కోట్లు, డిఏ బకాయిలు కోసం రూ.20 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న 8,053 మంది ఆర్టీసీ కార్మికులకు అప్పటి ప్రభుత్వం వేతనాల్లో కోత విధించింది. అప్పటి నుంచి కార్మిక సంఘాలు ఆ జీతాలు ఇవ్వాలని స్వరాష్ట్రంలో ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి. దాదాపు 8 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఆ వేతనాలు చెల్లిస్తామనీ, దానికోసం రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రిటైర్ అయిన కార్మికులకు ఇవ్వాల్సిన వేతనంతో కూడిన సెలవులు (ఈఎల్స్) చెల్లింపు కోసం రూ.20 కోట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థకు అక్కుపెన్సీ రేషియో (ఓఆర్) ద్వారా రోజుకు సరాసరి రూ.14 కోట్ల ఆదాయం వస్తున్నదని వివరించారు. సంస్థ కోసం చేసిన రూ. రెండువేల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్తిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సంస్థ అభివృద్ధి కోసం సిబ్బంది అందరూ కష్టపడుతున్నారని కొనియాడారు. ప్రజా రవాణా అవసరాలకనుగుణంగా కొత్తగా 1,150 బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. వీటిలో 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులు ఉన్నాయనీ, మరో 360 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్లు పిలిచామనీ చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్ని ఇంటర్ సిటీ కనెక్టివిటీతో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాలకు నడుపుతామన్నారు.
రెండు డిఏలకే ఉత్తర్వులు
ఆర్టీసీ కార్మికులకు మూడు డిఏలు ఇస్తామని విలేకరుల సమావేశంలో చైర్మెన్,ఎమ్డీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సాయంత్రం విడుదలైన ఉత్తర్వుల్లో రెండు డిఏలు మాత్రమే ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే డిఏ బకాయిలు మొత్తం చెల్లిస్తామని చెప్పి, కేవలం మూడు డిఏ బకాయిల సొమ్ము మాత్రమే విడదల చేశారు. మరో నాలుగు పాత డిఏల బకాయిలు చెల్లించాల్సి ఉంది.