Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న గెస్ట్ ఉపాధ్యాయులకు వేతనంలో కోతను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టును శుక్రవారం హైదరాబాద్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి కలిసి వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో దసరా సెలవులున్నందున 100 పీరియడ్లకు బదులు 64 పీరియడ్లకే గౌరవ వేతనం చెల్లించాలంటూ ఆ సొసైటీ కార్యదర్శి ఆదేశించటాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో రెగ్యులర్ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నందున మూడు వేలమంది గెస్టు టీచర్లు పనిచేస్తున్నారని వివరించారు. వారు ప్రతిరోజూ ఆరు/ ఏడు పీరియడ్స్ (సగటున నెలకు 150 పీరియడ్స్ పైగా) బోధిస్తున్నారని తెలిపారు. సెల్ఫ్ స్టడీ, నైట్ స్టడీ పర్యవేక్షణ, నైట్ స్టే తదితర విధులునూ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతినెలా గరిష్టంగా 100 పీరియడ్స్ మాత్రమే లెక్కగట్టి రూ.24 వేలు గౌరవ వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా సెలవుల కాలానికి వేతనంలో కోత విధించటం వల్ల వారికి గౌరవ వేతనంలో రూ.పది వేల వరకు కోత పడనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గెస్ట్ టీచర్లకు సహజంగానే శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇచ్చే కొద్దిపాటి వేతనంలోనూ సెలవుల పేరుతో భారీగా కోత విధిస్తే వారి కుటుంబ పోషణ కష్టమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గెస్ట్ టీచర్ల ఆవేదనను మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని వేతనంలో కోతను విరమించుకుని సెప్టెంబర్, అక్టోబర్‌లో పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.