Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు..
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -చౌటుప్పల్
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన స్వార్థం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వామపక్షాలు మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో రోజు రోజుకీ బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదని చెప్పారు. కాంగ్రెస్ బలహీనపడు తుందన్నారు. కమ్యూనిస్టుల మద్దతు ప్రజల్లో, కార్యకర్తల్లో విశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి తన స్వార్థం కోసం రాజీనామా చేశాడు తప్ప మునుగోడు అభివృద్ధి కోసం కాదని ప్రజలకు తెలుసన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. 8 లక్షల కోట్ల నల్లధనం తీసుకొచ్చి ఇంటింటికీ పంచుతామని చెప్పిన బీజేపీ ఒక్క రూపాయి కూడా పంచలేదన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా మత కల్లోలాలు సృష్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీలను అణచివేయాలని చూస్తుందని విమర్శించారు. దుర్మార్గమైన బీజేపీని ఓడగొట్టడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, పైళ్ళ ఆశయ్య, బట్టుపల్లి అనురాధ, నాయకులు మేక అశోక్ రెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, దొడ యాదిరెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, గంగాదేవి సైదులు, బండారు నరసింహ, మున్సిపల్ వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలం పాల్గొన్నారు.
- అందరూ వెళ్లిపోతుంటే బండి ఏం చేస్తున్నట్టు?
- బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అసహనం!
నవతెలంగాణ -నల్లగొండ
ప్రాంతీయ ప్రతినిధి
మూడ్రోజులుగా బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి సాగుతున్న వలసలపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వలసల ప్రభావం మునుగోడు ఉప ఎన్నికల మీద పడుతుందని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. తాను మాట్లాడి ఆపుతున్నాను అని.. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్లే వాళ్లని ఆపకుండా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదని కార్యకర్తల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.