Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రూడాయిల్ ధరలో పెద్ద మార్పులేనప్పుడు మనకెందుకు పెరిగింది?
- మోడీ ప్రభుత్వం జనానికి ఏం చేసింది..?
- పెట్రోల్,డీజిల్‌పై సెస్సు ద్వారా కోట్లు గుంజుకున్నది
- అభివృద్ధే కులం..సంక్షేమమే మతం.. జనహితమే మన అభిమతం
- తెలంగాణ లారీ అసోసియేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-తుర్కయంజాల్
''మోడీ ప్రభుత్వం జనానికి ఏం మేలు చేసింది..? దోచుకోవడం తప్ప. ప్రజల మీద, దేశం మీద చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ లీటరు రూ.70, డీజిల్ లీటరు రూ.65 కే ఇవ్వాలి'' అని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శనివారం ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు.ముడి చమురు ధర పెరగలేదు కానీ.. మోడీ చమురు ధర మాత్రం భారీగా పెరుగుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభత్వం అధికారంలోకి వచ్చాకనే ఫ్లోరోసిస్ సమస్యను రూపు మాపిందని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను అద్భుతంగా తయారు చేసుకున్నామని, ఘననీయంగా ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుందని చెప్పారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని, ఎనిమిదేండ్లుగా కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే మన జన్మ ధన్యమైతదని చెప్పారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతం, జనహితమే మన అభిమతం అని ముందుకు పోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వేలేకపోతోందని, నూకలు తినండని తెలంగాణ ప్రజలను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మనల్ని అవమానించిన వారి తోకలు కత్తిరిద్దామా? వద్దా?' అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ''2014లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పుడు క్రూడాయిల్ ధర 94 డాలర్లు, ఈరోజు క్రూడాయిల్ ధర 98 డాలర్లుగా ఉంది.. పెద్దగా తేడా ఏం లేదు.. మరి ఆ రోజు లీటరు పెట్రోల్ ధర రూ.70 ఉంటే, నేడు రూ.112కి ఎందుకు చేరింది? రాష్ట్రాలేమైనా పన్నులు పెంచాయా? ముడి చమురు ధర పెరగలేదు కానీ, మోడీ చమురు ధర మాత్రం పెరుగుతోంది. ఆయన దోస్తులైనటువంటి బడా కార్పొరేట్లకు మేలు జరుగుతోంది'' అని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెస్సు విధించి రూ.30 లక్షల కోట్లు గుంజుకున్నదని చెప్పారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సుల రూపంలో వసూలు చేసిందన్నారు. ప్రజలపై ధరలు, పన్నుల భారం మోపి దోచుకున్నది చాలని, ఇప్పటికైనా మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లీటర్ పెట్రోలు రూ.70, లీటరు డీజిల్ రూ.65కే ఇవ్వాలని కోరారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందారెడ్డి, ఉపాధ్యక్షులు రాంరెడ్డి, సుర్వియాదయ్యగౌడ్, కె.బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.