Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆకలితో అలమటిస్తున్న 7,915 మంది
- పౌష్టికాహార లోపంలో రాష్ట్రంలో వికారాబాద్ 4వ స్థానం
- చిన్నారులను ఆదుకోవడంలో ఐసీడీఎస్ విఫలం
- కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం
- అంధకారంలో చిన్నారుల భవిష్యత్
నోరు తెరచి ఏం కావాలో అడగలేరు పసికందులు.. ముసి ముసి నవ్వులతో మైమరిపించే భావిభారత పౌరులు.. నేడు పౌష్టికాహారం లోపంతో అల్లాడుతున్నారు. వారి భవిష్యత్ అంధకారంలోకి నెట్టేయబడుతోంది.. ఆకలి కేకలతో అల్లాడుతున్నారు.. వీరిని ఆదుకోవాల్సిన ఐసీడీఎస్ పరిస్థితే అగమ్యగోచరంగా మారింది.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అది నిర్వీర్యమవుతోంది. ఈ ప్రభావం పసిమొగ్గలపై పడుతోంది. ఇందుకు నిదర్శనమే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికారుల లెక్క ప్రకారం.. సుమారు 8 వేల మంది, లెక్కల్లో లేని మరో 10వేల మంది చిన్నారులు పౌష్టికాహారలోపంతో బాధపడుతుండటం. రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా 4వ స్థానంలో నిలవడం గమనార్హం. పౌష్టికాహార లోపంతో దీనావస్థలో కొట్టుమిట్టడుతున్న చిన్నారులపై కథనం..
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న పిల్లలు లక్ష 76వేల 134 మంది. ఇందులో సరైన ఆహారం అందక అనారోగ్యంతో బాధపడుతున్న వారు 7వేల 915 మంది ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో 53 వేల చిన్నారులకుగాను, 3,098 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్ష 23 వేల మందిలో 4,807 మంది పిల్లలు తిండిలేమీతో బాధపడుతున్నారు. ఈ లెక్కలు కేవలం అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన వారివి మాత్రమే. వీరు కాకుండా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల పిల్లలు, అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు కానీ పిల్లలు సుమారు మరో 10వేల మంది వరకు ఉన్నట్టు స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మహాశ్వరం మండల పరిధిలో తుక్కుగూడ ప్రాంతంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల జీవన స్థితిగతులను పరిశీలిస్తే.. ప్రతి గూడిసెలో ఒక్కో చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోంది. సరైన పౌష్టికాహారం అందక.. నడవ లేకపోవడం, జుట్టు సరిగ్గా లేకపోవడం, పాలిపోయిన చర్మం, మానసిక అనారోగ్యం, రేచీకటి, మూర్చలు, దృష్టి లోపం ఇలా రకరకాల రోగాలతో చిన్నారులు అల్లాడుతున్నారు. ఈ కుటంబాల ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే కావడం తో పిల్లలకు పౌష్టికాహారం అందించలేక పోతున్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఈ చిన్నారులను పట్టించుకోవాల్సిన ఐసీడీఎస్ అటు దిక్కు చూడటం లేదు.
నిర్వీర్యమౌతున్న ఐసీడీఎస్ ప్రాజెక్టులు
చిన్నారులకు, బాలింతలకు బలవర్థకమైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఐసీడీఎస్ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యం అవుతున్నాయి. పేద పిల్లల ఆశలు అవిరి అవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలవర్థకమైన ఆహారం అందించాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలను మూసివేసే కుట్రలు చేస్తోంది. వాటిని బలహీన పరుస్తోంది. దీంతో చిన్నారుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయ బడుతోంది. బాలల కోసం పని చేయని ప్రభుత్వాలు ఎందుకని చైల్డ్ ప్రోటెక్షన్ స్వచ్ఛంద సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
పిల్లలందరికీి పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం
పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించాం. వారి ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ అందించేందుకు కృషి చేస్తున్నాం. వలస కార్మికుల పిల్లలను కూడా అంగన్వాడీ సెంటర్లలో చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
- మోతి, రంగారెడ్డి స్త్రీ, శిశుసంక్షేమ శాఖ పీడీ