Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాల్లోకి హానికరమైన వాయువులు
- గుండ్ల మాచునూరులో ఫార్మా కంపెనీలు
- కాలుష్య కోరల్లో మోడల్ స్కూల్ పిల్లలు
- పర్యవేక్షణ పట్టని పొల్యూషన్ బోర్డు
- హైకోర్టు జడ్జికి విద్యార్థి లేఖ
- అధికారులకు కోర్టు నోటీసులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
'కంపెనీలు వెదజల్లే కాలుష్య కోరల్లో చిక్కి.. విష వాయువులతో ఊపిరాడట్లేదు. ఫార్మా కంపెనీలు నిత్యం వెదజల్లే హానికర వాయువులు మా ప్రాణం తీసేట్లున్నాయి. ఘాటైన దుర్వాసనతో కూడిన వాయువులతో గాలంతా కలుషితమవుతోంది. విష వాయువుల ప్రభావంతో చుట్టు పక్కల గ్రామాల జనం కాలుష్యం బారినపడుతున్నారు. కంపెనీల సమీపంలో ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులు ఊపిరాడక తల్లడిళ్లుతున్నారు. మా తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించు కోవట్లేదు. మీరైనా మా కాలుష్య కష్టాలు తీర్చగలరు' ఇదీ.. ఓ విద్యార్థి ఆవేదన.
సంగారెడ్డి జిల్లా సమీపంలోని హత్నూర్ మండలం గుండ్ల మాచునూర్ సమీపంలో హానర్ ల్యాబ్ లిమిటెడ్, అరవింద ఫార్మా, ఆర్చ్ ఫార్మా ల్యాబ్, కొవలెంట్ పరిశ్రమ లున్నాయి. సంగారెడ్డి-గజ్వేల్ రహదారి వెంట విస్తరించిన ఈ పరిశ్రమలు నిత్యం హానికరమైన వాయువుల్ని వదులు తున్నాయి. దీంతో గుండ్ల మాచునూరు, ఇస్మాల్ఖాన్పేట, ఆరుట్ల, దుర్పట్ట ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఫార్మా కంపెనీల్లో టాబ్లెట్ల తయారీకి సంబంధించిన మెటీరియల్ ప్రాసెస్ జరుగుతుంది. రా మెటీరియల్ తీసుకొచ్చి వివిధ పద్ధతుల్లో ప్రాసెస్ చేసిన పౌడర్‌ను బయటికి పంపుతారు. 24 గంటలు నడిచే ఈ పరిశ్రమల నుంచి వాయువుల్ని గాల్లో వదులుతారు. హానికరం కాని వాయువుల్ని మాత్రమే రాత్రి పూటల్లో వదలాల్సి ఉన్నా అవేవీ పట్టట్లేదు. వాయువుల్ని గాల్లోకి వదలడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఘాటైన దుర్గంధం వస్తుండటంతో పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. గాల్లో తేమ అధికంగా ఉన్నప్పుడు శ్వాస పీల్చడమే కష్టంగా మారుతుంది. శ్వాసకోశ, ఆయాసం, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘ వ్యాధిగ్రస్తులు హానికర వాయువుల వల్ల తట్టుకోలేకపోతున్నారు.
శ్వాస పీల్చడమే కష్టమవుతోన్న విద్యార్థులు
ఫార్మా కంపెనీలు వెదజల్లే కాలుష్యపూరితమైన వాయువుల వల్ల సమీపంలో ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులు శ్వాస పీల్చుకోలేకపోతున్నారు. ఇక్కడ 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పక్కనే పరిశ్రమలు ఉండటం వల్ల గాల్లో వెలువడే వాయువులతో విద్యార్థులు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మూతికి మాస్కులు, రుమాలు కట్టుకున్నా వాసన వస్తుందని పలువురు విద్యార్థులు ఆవేదన చెందారు. ఈ పాఠశాలలో కంది, సంగారెడ్డి, హత్నూర మండలాల విద్యార్థులు చదువుకుంటున్నారు. గాల్లోంచి వచ్చే విష వాయువుల వల్ల చదువుపైనా ఆసక్తి చూపలేకపోతున్నారు. చాలా మంది పిల్లలు తలనొప్పితో బాధపడుతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు.
పర్యవేక్షణ పట్టని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
కంపెనీల నుంచి కాలుష్యం వస్తుందని స్థానికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. విషవాయువుల వదులుతున్నారని ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు వచ్చి తనిఖీ చేయడం తర్వాత పట్టించుకోకపోవడం వల్లే కంపెనీలు నిత్యం వాయువుల్ని వదులుతున్నాయని వెంకటేశ్ అనే వ్యక్తి చెప్పాడు. ఫార్మా కంపెనీల యజమానులు బడా పెట్టుబడిదారులు కావడం, వారికి రాజకీయ అండ ఉండటంతోనే పీసీబీ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. తనిఖీల వేళ సాధారణ వాయువుల్ని వదులుతూ తర్వాత హానికర వాయువుల్ని వదులుతున్నారు.
హైకోర్టు జడ్జికి విద్యార్థి ఫిర్యాదు
గుండ్ల మూచునూరులోని పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో మోడల్ స్కూల్ విద్యార్థి సిద్దార్థ హైకోర్టు జడ్జితో పాటు సంగారెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. తనతోపాటు 600 మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న కాలుష్యం సమస్యను లేఖలో పేర్కొన్నారు. కలుషితమైన వాయువులు, మురికి, ఘాటైన వాసన వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని, చదువుకోలేకపోతున్నామని వివరించారు. కంపెనీల కాలుష్యం, స్కూల్ సమీపంలోని పందుల పెంపకం, మైనింగ్ బ్లాస్టింగ్ సమస్యలతో పాటు స్కూల్లో విద్యుత్, పరిశుభ్రత సరిగ్గాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థి లేఖను సుమోటా స్వీకరించిన జడ్జి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని విద్యాశాఖ, పరిశ్రమలు, పొల్యూషన్, రెవెన్యూ, వాణిజ్య శాఖల ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు.
తనిఖీలు చేస్తున్నం
గీత- ఈఈ - పొల్యూషన్ కంట్రోల్ బోర్డు- సంగారెడ్డి
కంపెనీల వాయువుల ప్రమాదకర స్థాయిని రెగ్యులర్‌గా తనిఖీ చేస్తున్నాం. కంపెనీల్లో ప్రతి రోజూ మూడు పూటల రీడింగ్ తీసి నమోదు చేస్తున్నాం. ఎక్కడైనా ప్రమాదకరంగా ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. గుండ్ల మాచునూరు కంపెనీల పొల్యూషన్‌పై హైకోర్టు నుంచి నోటీసులు అందలేదు.