Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతరాన్ని వ్యసనాలకు అలవాటు చేస్తున్నారు
- సమస్యలు లేని సమాజం ఉండదు...
- వందశాతం ప్రజల మద్దతూ ఉండదు
- మీట్ ది ప్రెస్‌లో విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి క్షేత్రస్థాయి కేడర్ లేదనీ, పూర్తిగా డబ్బు, మద్యాన్నే నమ్ముకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. వాటిని ఆశచూపి, యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులు, డబ్బు కోసం ఈ ఉప ఎన్నిక తెచ్చారనీ, అందువల్లే పేదలు ఆయన నుంచి భారీగా ప్రయోజనాలు ఆశిస్తున్నారనీ, ఫలితంగా ఇవి ఖరీదైన ఎన్నికలుగా మారాయని విశ్లేషించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీతో మూడేండ్లుగా టచ్‌లో ఉన్నానని చెప్పడం, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేయమని అడుగుతున్న ఆడియో టేప్‌ల లీజేపీల వ్యవహరాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కౌలు రైతులు, ఆర్టీసీకార్మికులు, వీఆర్ఓ, వీఆర్ఏ, ఫీల్డ్ అసిసెంట్ల సమస్యల్ని విలేకరులు ప్రస్తావించగా...సమస్యలు లేని సమాజం ఉండదనీ, పార్టీలకు వందశాతం ప్రజల మద్దతు ఉండటం అసహజమనీ, ఆయా సమస్యల్ని తెలివిగా ఎలా పరిష్కరించారనేదాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందంటూ సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారనీ, తెలంగాణలో అందుకే తమతో కలిసి వస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి పరాజయం చెందితే బాధ్యత వహిస్తారా? అని అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ...ఎన్నికను తాను సమన్వయం చేస్తున్నాననీ, తన ఒక్కడి వల్లే అక్కడ పార్టీ అభ్యర్థి గెలుస్తారనే అతి విశ్వాసం తనకు లేదన్నారు. దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారనగానే బీజేపీలో ప్రకంపనలు రేగుతున్నాయనీ, గుజరాత్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైనే చర్చ జరుగుతున్నదని చెప్పారు. 8 ఏండ్లలో బీజేపీ రాష్ట్రానికి అదనంగా ఇచ్చిన నిధులు, వనరులు, ప్రాజెక్టులు ఏవీ లేవన్నారు. బీజేపీ రాజగోపాల్రెడ్డినిరూ.18వేల కోట్లకు కొని, ఉప ఎన్నిక సృష్టించిందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 8 ఏండ్లలో వైఫల్యాలే తప్ప, సాధించిందేమీ లేదనీ, పొరుగుదేశం బూచిని చూపి ప్రజల్ని రెచ్చగొట్టే అవకాశాలు కూడా లేకపోవడంతో, దేశంలో అలజడి సృష్టించాలనే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. మునుగోడులో టీఆర్ఎస్కు 14 నుంచి 18 శాతం ఓట్లు పోల్ అవుతాయని సర్వేలు చెప్తున్నాయనీ, రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉన్నాయన్నారు. కార్యక్రమానికి ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి, సభ్యులు రాజేష్, రమేష్వైట్ల, హరిప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణ...మా గొప్పతనం
విద్యుత్ ఉద్యోగుల విభజనపై టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ సుప్రీంకోర్టులో బేషరతు క్షమాపణలు చెప్తూ అఫిడవిట్ దాఖలు చేయడంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటం కోసం చివరి వరకు ప్రయత్నం చేశామన్నారు. జస్టిస్ ధర్మాధికారి కమిషన్ సిఫార్సులు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే, దాని అమలును కూడా నిలిపివేసి, చివరి క్షణం వరకు వేచి ఉన్నామన్నారు. కానీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు కావడంతో సీఎమ్‌డీ స్థాయి అధికారి క్షమాపణలు చెప్పేందుకు కూడా వెనుకాడకపోవడాన్ని తాము స్వాగతిస్తున్నామనీ, ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దీన్ని విద్యుత్ ఉద్యోగులు కూడా అర్థం చేసుకున్నారని చెప్పారు.