Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారిపై లైంగికదాడి ఘటన నేపథ్యంలో స్కూల్ గుర్తింపు రద్దు
- మిగతా విద్యార్థుల భవిష్యత్‌పై తల్లిదండ్రుల ఆందోళన
- ఏం చేయాలనేదానిపై విద్యాశాఖ కార్యదర్శి, డీఈవో ఇతర అధికారుల సమావేశం
- తల్లిదండ్రుల ప్రతిపాదనలపై చర్చ
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎల్కేజీ విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ వాహన డ్రైవర్ లైంగికదాడి ఘటన నేపథ్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై తర్జన భర్జన జరుగుతోంది. మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు స్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసిన విషయం విది తమే. అయితే, ఆ స్కూల్లో చదువుతున్న మిగతా 700 మంది భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తల్లిదండ్రుల సందేహాలను తీర్చాల్సిన బాధ్యతను మంత్రి విద్యాశాఖ అధికారులకే అప్పగించారు. దీంతో డీఈవో ఆర్.రోహిణి, ఇతర అధికారులు విద్యార్థులు నష్టపోకుండా సమీపంలోని పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వాలని డీఏవీ పాఠశాల యాజమాన్యాన్ని విద్యాశాఖ ఆదేశించింది. యాజమాన్యం ఫీజు చెల్లిస్తే విద్యార్థులను ఎక్కడై నా చేర్పించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటికిప్పుడు పాఠశాల మారడం కంటే స్కూల్ ఘటపై వేసిన కమిటీ విచారణ కొనసాగించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై కూడా విద్యాశాఖ పరిశీలిస్తున్నది అయితే, ఏ నిర్ణయమూ ఫైనల్ ప్రకటించలేదు. లైంగికదాడి ఘటన నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు ప్రభుత్వానికి సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక వారం రోజుల్లో వస్తుందని, దాని ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.