Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డి బ్రదర్స్‌ది రాజకీయ వ్యభిచారం
- మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల గెలుపు ఖాయం: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-సూర్యాపేట.
''రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. కానీ ఆ ప్రయత్నాలను కమ్యూనిస్టులు తిప్పికొట్టడం ఖాయం. తెలంగాణలో కాషాయ జెండాను ఎగరనివ్వబోం'' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు హిందూ, ముస్లిముల మధ్య గొడవలు సృష్టించి దానితోలబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. దేశభక్తి ముసుగులో ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హోల్‌సేల్‌గా అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతోన్మాద, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడంలో భాగంగానే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.
దక్షిణ తెలంగాణలో బలం పెంచుకోవాలని ఉద్దేశంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి రాజీనామా చేయించి ఉపఎన్నిక తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రచార స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడులో బీజేపీని గెలిపించాలని కార్యకర్తలకు ఫోన్లు చేయడం రాజకీయ వ్యభిచారం కాదా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు డబ్బులు, కాంట్రాక్టులు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మడం కోసమే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతోనే ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రయివేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలు చేసి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రతి వస్తువుపైనా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేస్తూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర నాయకులు జగదీశ్, జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, దండ వెంకట్‌రెడ్డి, ఎలుగూరి గోవింద్, కొప్పుల రజిత, మేకనబోయిన శేఖర్, చిన్నపంగ నర్సయ్య ఉన్నారు.