Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా : అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ- మెదక్ రూరల్
అచ్చనపల్లి చంద్రు తండా దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా పాస్‌బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. టేక్మాల్ మండలం చంద్రుతండా పరిధిలో గల సర్వే నెంబర్ 109 భూమిలో నిరుపేదలందరికీ పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం మాట్లాడుతూ.. అచ్చనపల్లి చంద్రు తండాకు చెందిన 200 కుటుంబాలు పాపన్నపేట మండలం నామాపూర్ గ్రామ శివారులో అటవీ ప్రాంత భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. కష్టపడి ఈ భూములను అభివృద్ధి చేసుకున్నారన్నారు. అనేకసార్లు బోర్లు తవ్వించి, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి పంటలు పండించుకుంటున్నారని చెప్పారు. 109 సర్వే నంబర్లోని ఈ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. వీరందరూ 2008 సంవత్సరంలో పట్టా సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారన్నారు. సర్వే నిర్వహించి ప్రాథమిక విచారణ చేపట్టినా ఇప్పటికీ వారికి పట్టాదారు హక్కులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ భూములను రైతులకు ఇవ్వాలన్నారు. అచ్చనపల్లి చంద్రు తండావాసులు సుమారు 200 మంది కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు.
అదనపు కలెక్టర్ రమేష్ స్పందించి డీఎఫ్ఓ, గిరిజన అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో సర్దార్ అశోక్, దుర్గా నాయక్, లక్ష్మణ్, మోతీలాల్, మహిళలు పాల్గొన్నారు.