Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిగ్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, రామకృష్ణగౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ విద్యలో జరిగిన అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) రాష్ట్ర అధ్యక్షులు మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ తెలిపారు. సెప్టెంబర్ వరకు జరిగిన అవకతవకలపై తగిన విచారణ చేసి ఇంటర్ విద్యా కమిషనర్ నివేదిక సమర్పించాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశించారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ విద్యలో సయ్యద్ ఒమర్ జలీల్ కమీషనర్ గా పనిచేస్తూ పదవీ విరమణ చెందిన సమయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర విజిలెన్సు కమిషన్‌కు, విద్యాశాఖ కార్యదర్శికి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశామని తెలిపారు. స్పందించిన విజిలెన్సు కమిషన్, విద్యాశాఖ కార్యదర్శి ఇంటర్ విద్యలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఇంటర్ విద్యా కమిషనర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించారని పేర్కొన్నారు. ఓఎస్డీ నియామకం, ఓడీలు, డిప్యూటేషన్లు ఇవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా రెమ్యూనరేషన్ ఇవ్వడం, ఏసీబీకి పట్టుబడిన ఓబిలి రాణిని నిబంధనలను తుంగలో తొక్కి మల్టీజోన్-2 ఆర్జేడీగా నియమించడం, ఆమె సొంత వాహనానికి అలవెన్సు తీసుకోవడం, విజిలెన్సు కేసు పెండింగులో ఉన్న లక్ష్మారెడ్డికి సూపరింటెండెంట్ నుంచి ఏడీగా ఆ పోస్టు నుంచి డీడీగా అక్రమంగా పదోన్నతి కల్పించడంపై విచారణ చేపట్టాలని కోరారు. 317 జీవో అమలులో కావాలనే కొందరు ఉద్యోగులకు నష్టం చేయడం, స్పౌజ్ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ పరిధిలో సంధ్యారాణికి పోస్టింగ్ ఇవ్వడం తదితర అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు. ఈ అంశాలపై విచారణ చేపట్టి ప్రత్యేకంగా అభిప్రాయాలను వివరించాలంటూ ఇంటర్ విద్యా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు.