Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకరన్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం
- సెమినార్లో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ కష్టజీవుల పక్షపాతి అని ప్రొఫెసర్ జి హరగోపాల్ అన్నారు. ఆయన జీవితం విద్యార్థులతోపాటు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. శంకరన్ 88వ జయంతిని పురస్కరించుకుని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో సెమినార్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ శంకరన్ లాంటి మహనీయుల జీవితాలను విద్యార్థులు తప్పకుండా అధ్యయనం చేయాలని సూచించారు. అందులోని మంచి అంశాలను తమ జీవితాలకు అన్వయించుకోవాలనీ, తద్వారా సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు. శంకరన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక కొత్త వ్యవస్థలను సృష్టించారని వివరించారు. గురుకులాల ఏర్పాటు అందులో భాగమేనని గుర్తు చేశారు. శంకరన్ కలెక్టర్‌గా ఉన్న సమయాల్లో ఆయన నివాస గృహాన్ని విద్యార్థుల చదువు కోసం ఇచ్చారని చెప్పారు. పద్మ విభూషణ్ అవార్డునూ ఆయన సున్నితంగా తిరస్కరించారని అన్నారు. ఆయనలా జీవించడం నేటి పరిస్థితుల్లో చాలా కష్టమైన పనిఅనీ, అలాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరణలో పెట్టాలని విద్యార్థులకు సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ మాజీ అడిషనల్ కమిషనర్, రిటైర్డ్ ఐవోఎఫ్ఎస్ వై సత్యనారాయణ, ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ శంకరన్ జీవితం ఆచరణీయం, అనుసరణీయమని అన్నారు. ఆయన ప్రతి అంశాన్నిగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోణంలో క్షుణ్ణంగా అధ్యయనం చేసే వారని గుర్తు చేశారు.
అలాంటి పద్ధతిని నేర్చుకోవాలని విద్యార్థులను కోరారు. అభివృద్ధికి తోడ్పడటం ద్వారా ఆయన పేరును సమాజంలో నిలబెట్టేందుకు అందరూ ప్రయత్నించాలన్నారు. అకాడమీ ప్రిన్సిపాల్ కె సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీశ్‌కుమార్, కోర్స్- కోఆర్డినేటర్ జనార్దన్ దండు, కార్యాలయ సిబ్బంది కోట మురళీకృష్ణ, తాళ్లపల్లి రాజా, బండారి రంజిత్ కుమార్‌తోపాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.