Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి మంత్రి కేటీఆర్ స్వదస్తూరితో లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని మోడీకి స్వదస్తూరితో లేఖ రాశారు. చేనేతపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే అంశంపై ప్రధానికి పోస్టు కార్డు రాయాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంబంధించిన అనేకాంశాలను పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సమస్యలు చాలవన్నట్టు మోడీ ప్రభుత్వ హయాంలో చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని వేశారని తెలిపారు. వాటిపై పన్నేసిన తొలి ప్రధాని మోడీయే అని ఎద్దేవా చేశారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్భర్ భారత్, మరోవైపు గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లె వేసే కేంద్రం... తమ విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని కేటీఆర్ విమర్శించారు.