Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
డోర్నకల్, మిర్యాలగూడ మధ్య కోదాడ, హుజూర్‌నగర్‌ను రైల్వేలతో అనుసంధానించే కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొత్త రైల్వేలైన్ల కోసం ఎన్నో సార్లు కేంద్ర రైల్వే శాఖకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. కోదాడ, హుజూర్నగర్ మీదుగా డోర్నకల్-మిర్యాలగూడ మధ్య 93.10 కిలోమీటర్లమేర కొత్త సింగిల్ ఎలక్ట్రిఫికేషన్ లైన్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 2013-14లో అనుమతి లభించిందనీ, ప్రస్తుతం దీనికి సూత్రప్రాయ ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 1294.12 కోట్లు అనీ, నాలుగేండ్లలో గ్రౌండింగ్ అయ్యే అవకాశం ఉందన్నారు. రెండు కొత్త రైల్వేస్టేషన్లు సహా 11 స్టేషన్లను కలుపుతూ కొత్త రైల్వే లైన్ ఉంటుందని తెలిపారు. పాపట్‌పల్లి, గొల్లపాడు, గుర్రాలపాడు, గువ్వలగిడెం, నేలకొండపల్లి, రామచంద్రాపురం, కోదాడ, హుజూర్నగర్, ఎర్రగుట్ట వర్ధాపురం, జనపహాడ్ ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాలు సిమెంట్ కంపెనీలు, రైస్ మిల్లులకు కేంద్రంగా ఉన్నాయనీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకే కాకుండా ఖమ్మం జిల్లాకు కూడా కొత్త రైల్వేలైన్ వల్ల మేలు జరుగుతుందని చెప్పారు. ఆహార ధాన్యాలు, సిమెంట్, గ్రానైట్, ఎరువులు, బొగ్గు రవాణా కోసం కొత్త రైల్వేలను ఉపయోగించాలని రైల్వే ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు, కోదాడ, హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.