Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వం : టీఎంయు నేత అశ్వద్ధామరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసం చేస్తున్నదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) గౌరవాధ్యక్షులు ఇ అశ్వత్థామరెడ్డి తెలిపారు.శనివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో యూనియన్ అధ్యక్షులు తిరుపతి,ప్రధాన కార్యదర్శి ఎఆర్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం డీఏ ప్రకటించిందని తెలిపారు. చట్టబద్ధంగా కార్మికులకు రావాల్సిన పే రివిజన్, బాండ్ల డబ్బులు, సీసీఎస్ బకాయిలు, యూనియన్ల పునరరుద్ధరణ, ఉద్యోగ భద్రత లాంటి అంశాలను యజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి కంటితుడుపు చర్యగా మూడు డీఏలను ప్రకటించి రెండింటికి మాత్రమే ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్దిపొందేందుకు టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేసుకుంటోందని ఆరోపించారు. ఇది కార్మికులను మోసం చేయడమేనని విమర్శించారు. మొదటి నుంచి ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి వైఖరి సరిగా లేదని చెప్పారు. సకల జనుల సమ్మెకు సంబంధించిన బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు రెగ్యులర్‌గా చేపట్టడంతో పాటు 2013 నాటి బాండ్ల డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకు భిన్నంగా కంటి తుడుపు చర్యలతో మభ్యపెట్టాలని చూస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.