Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుర్రా వెంకటేశం అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన నిరుద్యోగ పేద యువత పోలీస్ నియామక పరీక్షలో అధికసంఖ్యలో అర్హత సాధించడం పట్ల బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించి ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత పొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించేలా యువతకు గ్రూప్ 2,3,4 పరీక్షలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు సమాయత్తమవుతున్న బీసీ స్టడీ సర్కిల్లో యువత పెద్ద సంఖ్యలో చేరాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందుకోవాలనీ, సరైన ప్రణాళికతో చదివి ఉద్యోగం సాధించాలని సూచించారు. పోలీస్ నియామక బోర్డు నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వారిలో 1,048 మంది అర్హత సాధించారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 స్టడీ సర్కిళ్లలో పోలీస్ ఉద్యోగాల కోసం 2,980 మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 1,048 మంది రాత పరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ రౌండ్‌కు ఎంపికయ్యారని వివరించారు. అధిక సంఖ్యలో యువత ఉత్తీర్ణత సాధించేలా కోచింగ్ అందించిన బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్, అధ్యాపకులను ఆయన అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్-2,3,4 శిక్షణా తరగతుల్లో విద్యార్థులు చేరాలని తెలిపారు.