Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరంతర అధ్యయనశీలి, పోరాటయోధుడు
- ఉపాధ్యాయ ఐక్య ఉద్యమాల రూపకల్పనలో ఆయనది కీలక పాత్ర: టీఎస్‌యూటీఎఫ్ నిర్వహించిన సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో విద్యారంగంపై దాడి జరుగుతున్న సందర్భంలో ఆ రంగంపై మంచి పట్టుండి పోరాడే వ్యక్తి నాగటి నారాయణ అని పలువురు వక్తలు అన్నారు. ఆయన మన మధ్యలో లేకపోవడం తీరని లోటు అని చెప్పారు. దేశంలో సంస్కరణల ముసుగులో విద్యను కార్పొరేట్, ప్రయివేటు శక్తులకు అప్పగించే కుట్ర వేగతరమైందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో కాషాయీకరణను జొప్పించే యత్నం తీవ్రమైందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్కరూ పోరాటాల్లోకి రావాలనీ, విద్యారంగం నిర్వీర్యానికి పాలకులు తీసుకుంటున్న విధానాలను తిప్పికొట్టడమే నారాయణకు ఇచ్చే నివాళి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యూటీఎఫ్ నిర్మాణానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నాగటి నారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొదట నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ విభాగం మాజీ డైరెక్టర్ మన్మధరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం.రవీందర్, డీటీఎఫ్ అధ్యక్షులు ఎం సోమయ్య, టీఆర్టీఎఫ్ నాయకులు షడ్రక్, పెన్షనర్ల సంఘం నాయకులు పి కృష్ణమూర్తి, ఎ రాజేంద్రబాబు, జనార్దన్ రెడ్డి, కెవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, ఎస్టీఎఫ్ టీఎస్ అధ్యక్షులు యు.పోచయ్య, బీటీఎఫ్ అధ్యక్షులు ఎన్ యాదగిరి, రైతు సంఘం నాయకులు అరిబండి ప్రసాదరావు, ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాల నాయకులు జంగయ్య, రామకృష్ణ గౌడ్, రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్, వి.కృష్ణమోహన్, సి.కమలాకుమారి, ఎన్ కిష్టయ్య, పి మాణిక్ రెడ్డి, టి లక్ష్మారెడ్డి, రవికుమార్, శ్రీధర్, సత్యానంద్, అశోక్, విద్యాదేవి, కె.శ్రీనివాసులు, నారాయణ కుమార్తె అక్షర, భార్య సంధ్య, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ...గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కొట్లాడి విజయం సాధించిన వ్యక్తి నారాయణ అని గుర్తుచేసుకున్నారు. ఆయన జీవితమంతా ఉపాధ్యాయ ఉద్యమంలో కొనసాగిందని కొనియాడారు. అందరికీ విద్య, వైద్యం అందేలా ఆయన బాటలో పోరాడాలని పిలుపునిచ్చారు. బి.వెంకట్ మాట్లాడుతూ.. వామపక్ష ఉద్యమాల పట్ల అంకితభావంతో నారాయణ పనిచేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించడంలో భాగంగా హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాణిక్‌రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ..నారాయణ నిరంతర అధ్యయన శీలి అని కొనియాడారు. మనం చేసే ఉద్యమాలు, అధ్యయనాలే మంచి నాయకునిగా తీర్చిదిద్దుతాయని చెప్పడానికి నారాయణే మంచి ఉదహరణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన గెలుపు కోసం కృషి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. మన్మధరెడ్డి మాట్లాడుతూ.. భాష, నడత, నడక, పోరాటం, విషయపరిజ్ఞానం, ఇలా ఏ అంశంలో చూసినా ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడేదని గుర్తుచేశారు. టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావరవి మాట్లాడుతూ..వ్యవసాయ, నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి నారాయణ అంచలంచెలుగా ఎదిగిన తీరును వివరించారు. యూటీఎఫ్ బలోపేతానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చేసిన ఐక్య పోరాటాల క్రమాన్ని తెలిపారు. టీచర్‌గా రిటైర్డ్ అయిన తర్వాత తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించి ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీసెస్ స్థాపించి విద్యారంగం పోకడలపై నిరంతరం అధ్యయనం చేయడంతో పాటు మేధావులను, విద్యావేత్తలను అందులో భాగస్వామ్యం చేసేవారని గుర్తుచేశారు.