Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డి బ్రదర్స్వి కోవర్ట్ రాజకీయాలు
- టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించండి: మనుగోడు రోడ్‌షోలో మంత్రి కేటీఆర్,
- సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-చండూరు
రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లా గట్టుపల్ మండలకేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు గట్టుప్పల్ మండల ప్రజలు బోనాలు, కోలాటాలు, ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుగోడుకు ఉపఎన్నిక ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కార్పొరేట్ కమలానికి, గరీబోళ్ల గులాబీకి మధ్య పోటీ అన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయి, బలవంతంగా ఉప ఎన్నికను తెచ్చిన ఘనుడు రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఉండి మునుగోడులో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఎన్నడూ మునుగోడు ప్రాంతానికి నిధులివ్వాలని ఏ మంత్రినీ కలిసిన దాఖలాల్లేవన్నారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాడన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడిన్డి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇంటింటికి కుళాయిల ద్వారా సురక్షిత నది జలాలను అందిస్తున్న కేసీఆర్ ఫ్లోరైడ్ ప్రాంతాల్లో సాగు నీరు కూడా అందించేందుకు పాలమూరు-డిండి ఎత్తి పోతల పథకాలను నిర్మిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నెంబర్‌వన్ స్థానంలో దూసుకెళ్తుందన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తే సిలిండర్ ధర రూ.2 వేలు అవుతుంది.. జాగ్రత్త ప్రజలారా బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నేతన్నలకు చేయూత పథకం ద్వారా చేయూత అందిస్తున్నామని, మరో రెండు చేనేత క్లస్టర్లను కూడా మంజూరు చేస్తామని తెలిపారు. గట్టుప్పల్‌ను కొత్త మండలంగా ఏర్పాటు చేసింది కేసీఆరేనన్నారు. చండూర్ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని పల్లె కల్యాణి రవికుమార్ కోరారని, డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మునుగోడులో గద్దలు తిరుగుతున్నాయని, వాటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోకి అమిత్‌షా వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పలేదన్నారు. కేవలం కేసీఆర్‌ను గద్దె దింపమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మతవిద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వ ఆస్తులు అన్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పారు. ఎనిమిదేండ్ల పాలనలో ప్రధాని మోడీ రైతు వ్యతిరేక కార్మిక చట్టాలు తెచ్చారన్నారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు అసదుద్దీన్ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సభలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగులింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీటీసీలు అవ్వారు గీత శ్రీనివాస్, చెరిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.