Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజు కూలి రూ.600 ఇవ్వాలి
- ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించాలి
- వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి : వ్యకాస సంగారెడ్డి జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ-సదాశివపేట
ఉపాధి హామీ చట్టానికి తప్పనిసరిగా నిధులు పెంచాలని, రోజు కూలి రూ.600 ఇవ్వడంతో పాటు ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభలను సదాశివపేట పట్టణంలోని కామ్రేడ్ కె. కృష్ణమూర్తి నగర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు బి.రామచందర్ ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి పేద ప్రజల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఉపాధి హామీకి నిధుల కోత విధిస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఉపాధి హామీ చాలా కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరల కారణంగా పేదలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులన్నీ ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. తెలంగాణలో భూమి, ఇండ్ల స్థలాలు, ఇండ్ల సమస్య తీవ్రంగా ఉందని, ఎనిమిదేండ్లుగా భూ పంపిణీ, ఇండ్ల స్థలాలు పంపకం జరగలేదన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వ్యవసాయ కార్మికులు, పేదల ఎదుర్కొం టున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చించి, వాటి పరిష్కారానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మహాసభలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.రామచందర్, ఎం.నర్సింహులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అతిమెల మాణిక్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, ఎన్పీఆర్డీ మాజీ జిల్లా కార్యదర్శి శ్రీశైలం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రమేష్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.అనిల్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పి.అశోక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చంద్రన్న, సంగన్న, జి.నర్సిములు, భూషణం, సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.