Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
- సంతాప సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-నల్లగొండ
ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, నిరంతరం ఉపాధ్యాయ సమస్యల సాధనకు పోరాడిన అలుపెరుగని యోధుడు నాగేటి నారాయణ అని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎస్బీఆర్ గార్డెన్లో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు నారాయణ సంతాపసభకు ఆయన హాజరై మాట్లాడారు. నారాయణ ఎంతో అంకుఠిత దీక్ష కలిగిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకులన్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తుందని తెలిపారు. నారాయణ లాంటి వారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టత కోసం కృషి చేస్తూ టీఎస్ యూటీఎఫ్ నినాదాలైన అధ్యాయనం, అధ్యాపనం, సామాజిక స్పృహను పూర్తిగా ఆకలింపు చేసుకొని ముందుకు సాగారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. నారాయణ అడుగుజాడల్లో టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతుందన్నారు. నారాయణ ఉపాధ్యాయ సమస్యలకు గల మూల కారణాలను ఆకలింపు చేసుకొని వాటి పరిష్కారం కోసం కృషిచేసిన వ్యక్తిగా కొనియాడుతూ, అణగారిన సామాజిక తరగతి నుంచి ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం యూటీఎఫ్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, జిల్లా సీనియర్ నాయకులు ఆంజనేయులు, పెన్షనర్ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధానకార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు బి. శ్రీనివాసచారి, బి.అరుణ, కోశాధికారి శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు సరళ, సీనియర్ నాయకులు కే.గోవర్ధన్, జిల్లా ఆఫీస్ ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.