Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుండగులను అరెస్టు చేయాలని ధర్నా
నవతెలంగాణ-నాంపల్లి
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై ఆదివారం బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. దాంతో తన కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నాంపల్లి మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు, కార్తకర్తలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం చండూరు నుంచి నాంపల్లి మండలానికి వెళ్తున్న తన కాన్వారు నాంపల్లి సరిహద్దుకు వచ్చేవరకు తమ వాహనాల ముందు వెళ్తున్న బీజేపీ కార్యకర్తలు ఉన్న వాహనం తమకు దారి ఇవ్వకుండా సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.నాంపల్లి దగ్గరలో బీజేపీ వారి వాహనాన్ని తప్పించి ముందుకెళ్లి దారి ఎందుకు వదలడం లేదని అడిగామని, దీంతో తనతో గొడవపడి బూతులు తిడుతూ దాడికి యత్నించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్, పున్నకైలాస్నేత, దామెర సర్పంచ్ దామెర యాదగిరి, కొమ్ము భిక్షం, నాంపల్లి సంజీవ, తదితరులు పాల్గొన్నారు.