Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమైక్య దేశాన్ని కాపాడుకోవడానికే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని చిన్నాభిన్నం చేసే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సమైక్యంగా ఉన్న దేశాన్ని సంరక్షించుకోవడంతో పాటు సమైక్యతను కాపాడటానికే భారత్ జోడోయాత్ర చేపట్టినట్టు తెలిపారు. మత శక్తుల నుంచి దేశాన్ని సంరక్షించుకోవడానికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ధరల నియంత్రణ కోసం ఈ యాత్ర సాగుతోందనీ, దీన్ని ఏశక్తి అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఆదివారం ఉదయం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రాహుల్ రాక పార్టీశ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. దీపావళి పండుగ సందర్భంగా మూడు రోజులు విరామం ఉంటుందని, తిరిగి ఈనెల 27నుంచి యథావిథిగా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు భట్టి విక్రమార్క, తెలంగాణ ఇన్చార్జి మణిక్యంఠాకూర్, మాజీ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వాకిట శ్రీహరి, నాయకులు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.