Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ కార్యకర్తలను హెచ్చరించిన రాజగోపాల్‌రెడ్డి
- గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై చిన్నకొండూరు గ్రామస్తుల నిలదీత
- ''గో బ్యాక్ బీజేపీ.. గో బ్యాక్ రాజగోపాల్‌రెడ్డి..'' అంటూ నినాదాలు
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
'అరేయ్ కుక్కలు.. మీసంగతి చూస్తా' అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలను హెచ్చరించారు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు, మసీదుగూడెం, పెద్ద కొండూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచిందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. గ్యాస్ సిలిండర్‌ను చూపిస్తూ.. 'గో బ్యాక్ బీజేపీ.. గో బ్యాక్ రాజగోపాల్‌రెడ్డి..' అంటూ నినాదాలు చేశారు. దాంతో నిరసన వ్యక్తం చేస్తున్న టీిఆర్‌ఎస్ కార్యకర్తలను కుక్కలుగా సంబోధిస్తూ రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. గ్రామంలో సొంత నిధులతో పనులు చేస్తానని చెప్పి.. ఎందుకు చేయలేదని రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్తులు ప్రశ్నించారు. నాలుగేండ్లలో ఏనాడూ గ్రామం వైపు కన్నెత్తి చూడని అతను ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకానొక దశలో బాహాబాహీ అంటూ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు గ్రూపులను శాంతింప చేశారు. అదేవిధంగా మండలంలోని నేలపట్ల గ్రామంలోనూ రాజగోపాల్‌రెడ్డి ప్రచారరథాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా ఐదు రోజుల కిందట రాజగోపాల్‌రెడ్డికి ప్రచారం చేసేందుకు వచ్చిన డీకే అరుణకు సైతం నిరసన తగిలిన విషయం విధితమే.