Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచూకీ కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లు
- ఒకరి మృతదేహం లభ్యం
- ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, తహసీల్దార్
నవతెలంగాణ-పాలకవీడు
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మహంకాళిగూడెం వద్దనున్న కృష్ణానది పుష్కర ఘాటు వద్ద ఆదివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. పోలీసులు గాలించి ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్ఐ సైదులుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తంగేడు కుంటకాలనీకి చెందిన 100 మంది భక్తులు మూడులారీల్లో జాన్‌పహాడ్ దర్గా వద్దకు కందూరు నిమిత్తం వచ్చారు. సమీపంలోని కృష్ణానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈక్రమంలో నాగూరు ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడ్డాడు. అతన్ని రక్షించే క్రమంలో అతని సోదరుడు సుభాని(25) కూడా నదిలో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, పోలీసు బృందాలు, సర్పంచ్ అందుబాటులో ఉన్న స్థానికులతో విస్తృతంగా గాలించారు. కష్ణానది ప్రవాహం ఉధృతంగా ఉండటంతో స్థానిక గజ ఈతగాళ్లు గాలించి గల్లంతైన వారిలో సుభాని మృతదేహాన్ని వెలికితీశారు. సోమవారం ఉదయం వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తే నాగూర్ ఆచూకీ లభించవచ్చని అధికారులు తెలిపారు. తహసీల్దార్ ఎన్టీఆర్ఎఫ్ బృందాల సహాయం కావాలని కోరుతూ కలెక్టర్‌ను కోరారు. గాలింపు కొనసాగుతూనే ఉంది. కాగా, తహసీల్దార్ శ్రీదేవి ఘటనాస్థలిని పరిశీలించి కుటుంబసభ్యులను ఓదార్చారు. గల్లంతైన వారి కుటుంబసభ్యులు, బంధువుల రోదనతో ఘటనాస్థలం వద్ద విషాదం చోటుచేసుకుంది. బాధితుల తల్లి షేక్జాన్ బీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.