Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటికీ, మొర్రికి సంబంధమే లేదు
- జ్యోతిష్యుల చేతుల్లో ప్రజలు మోసపోవద్దు : విజ్ఞానదర్శిని రౌండ్టేబుల్లో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రహణాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోవని పలువురు వక్తలు చెప్పారు. గర్భిణీలు అపోహలను విడనాడాలని పిలుపునిచ్చారు. గ్రహణాలకు, మొర్రికి అస్సలు సంబంధమే లేదని తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూఢనమ్మకాల నిర్మూలనా చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో 'గ్రహణాలు మూఢ నమ్మకాలు- వాస్తవాలు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం నిర్వహించే 'గ్రహణ సూర్యునితో భోజన కార్యక్రమం' వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సమావేశానికి విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు, మూఢనమ్మకాల నిర్మూలనా చట్ట సాధన సమితి కన్వీనర్ రమేష్ అధ్యక్షత వహించారు. ప్రముఖ సామాజికవేత్త, ప్రజావైద్యులు డాక్టర్ శంకర్, ఉస్మానియా యూనివర్సిటీ ఖగోళశాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎల్లయ్య, మానవవికాస వేదిక జాతీయ నాయకులు సాంబశివ మాట్లాడుతూ... ప్రస్తుత కాలంలో జ్యోతిష్కులు, క్షుద్ర పూజలు చేసేవారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రహణాలు ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని నొక్కిచెప్పారు. గ్రహణాలపై గర్భిణీలకున్న అపోహలపై వివరణ ఇచ్చారు. గ్రహణాల సమయంలో గర్భిణీలు భయపడొద్దని చైతన్యపరిచారు. రాశులు, గ్రహబలాల పేరుతో మోసపోవద్దని సూచించారు. గ్రహణాల గురించి పూర్తి అవగాహన లేకపోవడం వలనే ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయన్నారు. ప్రస్తుత కాలంలో ఖగోళ శాస్త్రాన్ని మూఢనమ్మకాలను పెంపొందించే విధంగా జ్యోతిష్యులు వాడుకోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం ద్వారానే మూఢనమ్మకాలను అరికట్టవచ్చునని తెలిపారు. ఈ గ్రహణాలకు సంబంధించిన మూఢనమ్మకాలను ప్రజలలో నిర్మూలించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. 25న అందరూ గ్రహణ సూర్యునితో భోజనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని, మానవవికాస వేదిక, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకులు విజయ కందుకూరి, పరమేష్, మహేశ్, తుమ్మా భాస్కర్, అచ్యుత రామయ్య, భూపతి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.