Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా
- దిగొచ్చిన అధికారులు.. సాయంత్రం కాటాలు ప్రారంభం
నవతెలంగాణ-వైరా టౌన్
ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్కు పెసలు తెచ్చి 13 రోజులవుతున్న కాటాలు వేయకపోవడంతో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పాల్గొని మాట్లాడారు. మార్క్ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు కేంద్రాన్ని అక్టోబర్ 12న ప్రారంభించారని, కానీ నేటి వరకు ఒక రైతు నుంచీ పెసలు కొనుగోలు జరగలేదన్నారు. శనివారం రైతులు ఆందోళన చేయడంతో తేమశాతం చూసి ఆదివారం ఉదయం నుంచి పెసలు కాటాలు వేస్తామని అధికారులు హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. పండుగ పూట కూడా మహిళ రైతులు మార్కెట్లో ఉండాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. పొలాల నుంచి ఇంటికి పెసలు వచ్చి రెండు నెలల అయిందని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించడంపైన అనుమానాలు వ్యక్తం కావడంతో రైతులు చాలా తక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో అమ్ముకొని నష్టపోతున్నారని తెలిపారు. మార్కెట్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో పెసలు అమ్ముకునేందుకు 20 మంది రైతులు వస్తే.. అధికారులు నరకం చూపిస్తున్నారని అన్నారు. రైతులు ఆందోళన చేయడంతో మార్కెట్ సూపర్వైజర్ ప్రసాద్ మార్కెట్ కార్యాలయం వద్దకు వచ్చి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు వెంటనే రైతుల పెసలు కాటాలు వేయాలని మార్క్ ఫెడ్ సిబ్బందిని ఆదేశించారు. సాయంత్రం మూడు గంటల నుంచి పెసలు కాటాలు వేయడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, రైతు సంఘం కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.