Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ విత్తనాలతో నట్టేట మునక
- ఫెర్టిలైజర్ షాపు దుకాణాదారులను నిలదీసిన అన్నదాతలు
నవతెలంగాణ- మణుగూరు
నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి.. అధిక దిగుబడులు వస్తాయంటూ కొంత మంది ఫెర్టిలైజర్ దుకాణాలు నకిలీ విత్తనాలు అంటగట్టి రైతును మోసం చేశాయి. నిత్యం కష్టపడి సాగు చేసిన పంట కోతకొచ్చే సమయంలో దిగుబడి చూసి లబోదిబోమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల వ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉండటంతో రైతులు దుకాణాల వద్దకు పరుగులు తీస్తూ మోసపోయామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. షాపు నిర్వాహకులను నిలదీయడంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే..
మండలంలో కొందరు ఫెర్టిలైజర్ షాపు యజమానులు ఎకరానికి 45 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని కొత్త రకం విత్తనాలను రైతులకు అంటగట్టారు. మండల వ్యాప్తంగా నకిలీ విత్తనాలు విక్రయించారు. రైతులు వారి మాటలు నమ్మి కొత్తరకం వరి విత్తనాలను సాగు చేశారు. ఈ విత్తనం నాటు వేసిన 20-25 రోజుల నుండే కంకి పోసుకోవడం మొదలైంది. పూర్తిగా కంకి పోసుకున్న వరి చేను నేలకు ఒరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట కూడా కోత కోయడానికి అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు తెలిపారు. సహజంగా పంట వంద నుంచి 120 రోజులు మధ్య చేతికి వస్తుంది. కానీ ఈ కొత్త విత్తనాల పంట 90 రోజులకే కోతకు వచ్చింది. మరోవైపు ఫెర్టిలైజర్ దుకాణాల వాళ్లు చెప్పినట్టు అధిక దిగుబడి కాకుండా ఎకరానికి 18 నుంచి 20 బస్తాల ధాన్యం దిగుబడి అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఆర్థికంగా నష్టపోయినా రైతులు నిరాశకు లోనవుతున్నారు.
దోమెడ గ్రామానికి చెందిన రైతు 20 ఎకరాలు కౌలుకు చేస్తున్నారు. ఎకరానికి కౌలు 12 బస్తాలివ్వాలి. దిగుబడి 18 నుంచి 20 బస్తాల మధ్య వచ్చింది. మొత్తం కౌలు, ఖర్చులు పోగా రైతులకు తాలు కూడా మిగిలే పరిస్థితి లేదు. నకిలీ విత్తనాల కారణంగా కౌలు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. మండల వ్యాప్తంగా సుమారు వందలాది ఎకరాల్లో ఈ కొత్త రకం విత్తనాలను రైతులు సాగు చేశారు. నష్టపోయిన రైతులు సదరు ఫెర్టిలైజర్ షాపు యజమాను లను నిలదీయగా, ఎకరానికి 35 బస్తాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా లోపాయికారి ఒప్పందం చేసుకుని.. రైతులు తమ వద్ద నుంచి చేజారిపోకండా ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.