Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాళ్లను బయటకు పంపేందుకు కొత్త కుట్ర
- నల్లమల చెంచుల ఉనికికే ప్రమాదం
- నార్లాపూర్ కుడిచింతల బైలు చెంచులతో అధికారుల మంతనాలు
- చచ్చినా అడవిని వదలబోమంటున్న చెంచులు
అడవినే తల్లిగా.. జీవనాధారంగా చేసుకుని బతుకీడుతున్న చెంచులపై పాలకులు ముప్పేట దాడి చేస్తున్నారు.. ఓసారి యురేనియం... మరోసారి టైగర్ జోన్.. ఇంకోసారి అడవిని వారు నాశనం చేస్తున్నారు.. అందుకే బయటకు తరలించి పునరావాసం, సౌకర్యాలు ఏర్పాటు చేస్తామంటూ రకరకాలుగా వారిని భయపెట్టి.. అడవిని హస్తగతం చేసుకునేందుకు కుటిల యత్నాలు చేశారు. వీటన్నింటికీ ఎదురొడ్డి బతుకుతున్న చెంచులకు ఇప్పుడు కోర్ జోన్ ముప్పు పొంచి ఉంది. వారికి ఒకరిని మోసం చేయడం తెలియదు. అడవిని తల్లిగా.. దేవతగా పూజిస్తారు.. ఇలాంటి కల్మషం లేని చెంచులను కోర్‌జోన్ పేరుతో మళ్లీ బయటకు పంపే యత్నాలు మొదలయ్యాయి. పులుల ప్రదేశమని నల్లమల మొత్తాన్ని కోర్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో నల్లమల చెంచులను అటవీ ప్రాంతం నుంచి గెంటేసే కుట్రలకు ప్రభుత్వం తెరలేపింది.
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
2018 నల్లమలను ప్రభుత్వం రెండు జోన్లుగా ప్రకటించింది. పులులు క్రూర మృగాలు తిరిగే ప్రాంతాన్ని కోర్ జోన్‌గా ప్రకటించింది. పులులు లేని బయలు ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించింది. కోర్‌జోన్‌లో జనం ఉండరాదు అనేది నిబంధనగా ఉంది. ఈ నిబంధన ఇప్పుడు చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించే కుట్రలకు దారితీసింది. పాడుపెంట, కోల్గం పెంట, సార్లపల్లి, కుడిచింతల, బైలు వటవర్లపల్లి తంగడి గుండాల చిల్లాపూర్, ఉప్పునుంతల, ఎల్పలమ్మ చేను, మస్క చేను, బాయి రాయివెట్ పెంట రోడ్లబండ, నర్సిపెంట, తవసిపెంట, అప్పాపూర్, మల్లాపూర్, ఫలహాబాద,్ చెదల గుమ్మి, పుల్లయ్యపల్లి, రాంపూర్, మేడిమల్కల, సంగడి గుండాల, ఆగర్ల పెంట, దూరాలపెంట, వీర్లపెంట, లింగ బేరి తదితర పెంటలు కోర్ జోన్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని అడవిలొ చిరుతలు, పులుల ఉత్పత్తి పెరుగుతుందన్న కారణం చూపి చెంచులను మదాన ప్రాంతాలకు తరలించేందుకు అధికా రులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే మేడి మల్కల, సార్లపెళ్లి పెంటలలో ఉండేవారిని పిలిచి అంగీకార పత్రాలను రాయించుకుంటున్నారనేది సమా చారం. పాతిక రోజులుగా నల్లమల చెంచులను మైదాన ప్రాంతాలకు పంపియాలనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.
గిరిజనేతరుల ద్వారా బయటికి పంపే కుట్ర
గతంలో చెంచులకు వ్యవసాయం నేర్పాలనే పేరుతో గిరిజనేతరులను నల్లమలకు రప్పించారు. చెంచులకు అప్పటికే వ్యవసాయంతో అనుబంధం ఉన్నప్పటికీ వీరిని ఎలాగైనా అడవి నుంచి ఖాళీ చేయించాలన్న కుట్రతో గిరిజనేతులకు చెంచుల దగ్గర ఆవాసం ఏర్పాటు చేశారు. నల్లమల నుంచి చెంచులను బయటకు పంపడానికి ముందుగా గిరిజనేతరులతో అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. గిరిజనేతరులు అయితే ఇక్కడ వచ్చే ప్యాకేజీతో మైదాన ప్రాంతంలో జీవించే అవకాశం ఉంది. గిరిజనులు బయటి ప్రపంచంలో ఇమడలేని అవకాశాలే మెండుగా ఉన్నాయి. అయితే, గిరిజనేతరులతోపాటు చెంచులను బయటకు పోవడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. గిరిజనేతరులు ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసి చెంచులకు అన్యాయం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానరాని అభివృద్ధి
ఇదే క్రమంలో అధికారులు చెంచుపెంటల్లో అభివృద్ధిని నిలిపేశారు. ఐదు సంవత్సరాలుగా ఐటీడీఏ అధికారిని నియమించలేదు. సీజనల్ వ్యాధులు వస్తే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఉపాధి కోసం గతంలో మాడ ద్వారా రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. నెల రోజులకు ఒక్కసారైనా వైద్యుడు అక్కడికి రావడం లేదు. పక్కా నిర్మాణాలు నిలిపేశారు. చలి నుంచి కాపాడడానికి కనీసం షెడ్లైనా నిర్మించాల్సి ఉంది. ప్రైమరీ ట్రైబల్ గ్రూపులు ఏర్పాటు చేసి వీరికి ఆర్థిక సాయం అందజేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనబడటం లేదు. చదువు లేక పిల్లలు అటవీ ఫల సేకరణలో ఉంటున్నారు. గతంలో చెంచు యువకులకు ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు టైగర్ ట్రాకర్ పేరుతో రెండు మూడు నెలలు ఉపాధి కల్పించి ఆ తర్వాత తొలగిస్తున్నారు. 2008లో గిరిజనేతరులను, చెంచులను బయటకు పంపించడానికి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ప్యాకేజీ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని రూ.15 లక్షలకు పెంచారు. 15 లక్షలతోపాటు ఐదెకరాల భూమి, రెండు పడకగదుల నిర్మాణం, సీసీరోడ్లు, అంగన్వాడీ కేంద్రం, మరో రూ.మూడు లక్షలు బాధితుని ఖాతాలో వేస్తామని చెబుతున్నారు. అయినా, దీనికి గిరిజనేతరులు ఒప్పుకున్నా చెంచులు చంచినా ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెబుతున్నారు.
అడవిని వీడేది లేదు
మల్లికార్జున్ -మాజీ సర్పంచ్- సార్లపల్లి- అమ్రాబాద్
మీరు ఎన్ని కుట్రలు పన్నినా.. కుతంత్రాలు చేసినా అడవిని వీడేది లేదు. అడవి లేకుండా మేము బతకలేం. మీరు ఇచ్చే ప్యాకేజీ ఎవరికి కావాలి? అడవి బిడ్డలం మేము అడవిలోనే ఉంటాం. అడవి గాలి, ఫలాలతో బతుకు తున్నాం. చెంచులు కాని వారితో ఒప్పందం కుదుర్చుకొని.. చెంచులకు ప్రమాదం కలిగేలా వ్యవహరిస్తే ఊరుకోం.
ప్యాకేజీ మాకు అవసరం లేదు
అడవిలోనే పుట్టాం.. ఈ అడవిలోనే పెరిగాం.. ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిని వీడం. గిరిజనేతరులు, మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వారు తిరిగి వారి ప్రదేశాలకు వెళ్లిపోతారు.. మేము ఎక్కడికి వెళ్లాలి? మేము బయట ప్రాంతానికి వెళ్తే బతకలేం.
లింగయ్య
- అప్పాపూర్ చెంచు