Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత హామీలపై నిలదీతలు..
- వెంట వెళ్లిన వారికి తప్పని ప్రశ్నల వర్షం
- ప్రతిపక్షపార్టీలో చేరితే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రజల ఆగ్రహం
- గుర్తింపులేక జిల్లా దాటెల్లిన కార్యకర్తలు.
- నమ్మితే మోసం చేశావంటూ కోమటిరెడ్డిపై దాడి
- జ్వరంతో ప్రచారానికి దూరంగా రాజగోపాల్‌రెడ్డి
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరపున అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటినుంచి ఈ రోజు వరకు ప్రజల నుంచి ఆయనకు ఎదురీత తప్పడం లేదు. ఎన్ని కుట్రలు చేసైనా సరే గట్టెక్కాలనుకుంటున్న బీజేపీకి నియోజకవర్గ ప్రజలు ఆ అవకాశం ఇవ్వడం లేదు. అభ్యర్థిని అడ్డుకోవడంతో పాటూ ఆయనపై దాడి కూడా చేయడం గమనార్హం. అంతేగాకుండా బీజేపీ నేతలు ఏ గ్రామానికి వెళ్లినా గతంలో చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించిన తర్వాతనే ఓట్లు అడగాలని నిలదీస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, ఇతర నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేక నోరెళ్లబెడుతున్నారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి సతీమణిని కూడ ప్రచారంలో అడ్డుకుని నమ్మిన వాళ్లను నామాలు పెట్టిన మనిషికి ఎందుకు ఓట్లు వేయాలని మహిళలు పలుచోట్ల ప్రశ్నించినట్టు సమాచారం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజల నుంచి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, ఆయన తరపున ప్రచారం నిర్వహించే నేతలందరికీ ప్రశ్నల వర్షం ఎదుర్కోకతప్పడం లేదు. నిన్నటి వరకు ప్రతి పక్షంలో ఉండి అభిఋద్ధి చేయలేదని చెప్పినవ్ కదా... ఇపుడు చేరిందీ కూడ ప్రతిపక్షమే కదా ఎలా అభివృద్ధి చేస్తారనే ప్రశ్నలకు వారినుంచి సమాధానం లేదు. అంతేగాకుండా కేంద్రం నుంచి నిధులేమైనా తీసుకువచ్చారా అంటే దానికి ముఖం చాటేస్తున్నారు. ఇవన్ని ఇలా ఉంటే సామాన్య ప్రజలకు అతి ముఖ్యమైన గ్యాస్ ధరలు, పెట్రోల్ , డిజిల్ ధరలను విపరీతంగా పెంచి వారి నడ్డివిరించిన సంగతి తమకు తెలుసనని వారు బీజేపీ నేతలను నిలదీస్తున్నారు. ఎస్ లింగోటం, అల్లాపురం, చిన్నకొండూరు. నాంపల్లి మండలంలో ఆయా గ్రామాల ప్రజలు నిలదీశారు. మూడు రోజుల కింద చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో నమ్మిన ప్రజలను మోసం చేశావని గ్రామస్తుడు రాజగోపాల్‌రెడ్డిపై చెప్పుతో దాడి చేయడంతో కలకలం రేగింది. ఆయనకే గాకుండా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో 2016లో ఫ్లోరోసిస్ రిసెర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, నేటికి దాని ఊసెత్తడంలేదని 'కాష్టం' (చితి) కూడ పేర్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళితే మహిళలు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేస్తానని గతంలో హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఊరికే రాలేదని ఎలా ఓట్లు వేయాలని ప్రశ్నించినట్టు సమాచారం.
గుర్తింపు ఇవ్వడంలేదని ....
సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్న క్షేత్రస్థాయి నాయకులు, యువతకు సరైనా గుర్తింపు తమకు దక్కడంలేదనే ఆవేదనలో ఉన్నారు. పార్టీ ప్రచారం మొదలైన దగ్గర నుంచి నామినేషన్లు పూర్తయ్యే వరకు ఆ పార్టీకి చెందిన పాత కార్యకర్తలు, నాయకులు ఎవరూ కూడ రాజగోపాల్‌రెడ్డి నిర్వహించే సమావేశాల్లో పాల్గొనలేదు. తన వెంట వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ, తమకు ఇవ్వడంలేదని సోషల్ మీడియా ఆడియో వైరల్ అయ్యింది. అదే పద్ధతి ఇప్పటికి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ఉన్న సుమారు 50మంది పార్టీ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి గుర్తింపూ ఇవ్వడంలేదని, తామెందుకు ఆయనకు ప్రచారం చేయాలని, ఓటెందుకు వేయాలంటే ఆసహనంతో తీర్థయాత్రలకు ప్రయాణమై వెళ్లినట్టు తెలిసింది. ఏ గ్రామంలో కూడా గతంలో ఎన్నికల సమయంలో పనిచేసిన బీజేపీ కార్యకర్తలు ఎవరూ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో కనిపించడంలేదు.
ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి...
ఎన్నికల పోలింగ్ సమయం ముంచుకొస్తున్న వేళ బీజేపీ అభ్యర్థికి తలనొప్పి రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న మొన్నటి వరకు గ్రామాలలో ్ల ప్రజలు అడ్డుకుంటుంటే చిర్రెత్తి పోయిన కోమటిరెడ్డి వారిని తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలూ ఏమంత ఉపయోగపడడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా తన వెంట వచ్చిన నేతలంతా ఇతర పార్టీలో చేరిపోతుంటే అసహనంతో ఉండిపోతున్నారు. తాను కొంత వారిని పార్టీలోకి తీసుకువస్తుంటే, బిజేపీలో ఉన్నోళ్లు ఇతర పార్టీలో చేరుతుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏం చేస్తున్నారని ఆయనపై మండిపడ్డారని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చివరికి జ్వరం వచ్చిందని మంగళవారం నాడు రాజగోపాల్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారని సమాచారం. అయితే ఇదంతా తన పట్ల ప్రజలకు సానుభూతి కలగాలని ఆయన జ్వరం పేరుతో ఇంటికే పరిమితమయ్యారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.