Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని చెక్‌పోస్టుల ఏర్పాటు
- మంగళవారం పోలీంగ్ కేంద్రాల వద్ద సీపీ ఆకస్మిక తనిఖీలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తుం డటంతో నియోజకవర్గంలో వందకుపైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 60, రాచకొండ పరిధిలో 40 చెక్ పోస్టులు పెట్టారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ఎస్‌ఐలతోపాటు 10మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంలు పూర్తిస్థాయిలో చేరుకోవడంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. దాంతో మరింత అప్రమత్తమైన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేక దృష్టి సారించారు. అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మండలాల సరిహద్దులతోపాటు గ్రామ గ్రామాన చెక్‌పోస్టులు పెట్టారు. ఎన్నికల అధికారులతో కలిసి మంగళవారం స్వయంగా పరిశీలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధి చౌటుప్పల్ మండలంలోని లింగోజీగూడా, జైకేసారం, నెలిపట్ల, లింగన్నగూడెంతోపాటు తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లపై సీపీ స్థానిలకులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అర్హులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సీపీ మహేష్‌భగవత్ ఓటర్లకు సూచించారు. ఎలాంటి భయాందోళనకు గురికావాల్సి అవసరం లేదని, భద్రత కట్టుదిట్టం చేశామని చెప్పారు.