Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం పేరుతో బీజేపీ రాజకీయాలు: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు
నవతెలంగాణ- చౌటుప్పల్‌రూరల్
దేశ ప్రజల మధ్య బీజేపీ మతం పేరుతో వైషమ్యాలు సృష్టించి.. రాజకీయ ప్రయోజనం పొందుతోందని, మరోవైపు పేద ప్రజలను దోచుకుని కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో చెరుపల్లి ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేద ప్రజలపై భారాలు వేస్తూ.. కార్పొరేట్లకు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం రాలేదని, కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిందని విమర్శించారు. ప్రజలపై విపరీత భారాలు మోపుతున్న బీజేపీలో చేరి రాజగోపాల్‌రెడ్డి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కనాడూ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచినందుకు ఓటు వేయలా అని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.