Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలి : మంత్రి సబితకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న డీఏవీ పబ్లిక్ స్కూల్ సంఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని కోరాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్సులు కె అశోక్‌రెడ్డి, ఎమ్డీ జావేద్, కె నాగలక్ష్మి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ స్కూల్లో చదువుతున్న చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ గుర్తింపును రద్దు చేసి మూసేయడంతో పిల్లల తల్లిదండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఆ స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని యధావిధిగా నడపాలని కోరారు. ఇప్పటికే వారు డీఏవీ స్కూలుకు పెద్దమొత్తంలో ఫీజులు చెల్లించారని తెలిపారు. ఇప్పుడు వేరే స్కూళ్లలో చేర్పిస్తే మళ్లీ ఫీజులు చెల్లించాల్సి వస్తుందనీ, తల్లిదండ్రులపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో బాలికలకు సరైన రక్షణ కల్పించాలని సూచించారు. బాలికలు సురక్షిత వాతావరణంలో చదువును కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే అన్ని విషయాలూ చర్చించి తగు చర్యలు చేపడతామంటూ హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు :
- అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టి ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
- ప్రతి పాఠశాలలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
- స్కూల్‌కు సరిపడే సంఖ్యలో టీచర్లు, ఆయాలుండేలా చూడాలి.
- ప్రతి స్కూల్లోనూ బోధన, బోధనేతర సిబ్బందికి జెండర్ సెన్సిటైజేషన్, చట్టాలపై అవగాహన ఖచ్చితంగా కల్పించాలి.
- అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలి
- తల్లిదండ్రులతో యాజమాన్యాలు తరచుగా సమావేశాలను నిర్వహించాలి.
- సిబ్బందిని నియమించేటపుడు వారి వ్యక్తిగత నేపథ్యాన్ని పూర్తిగా తనిఖీ చేయాలి.