Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్లు లేని పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది
- ఎన్వీ భాస్కర్‌రావు స్ఫూర్తితో కార్మిక కోడ్ల రద్దు కోసం పోరాడాలి :
సీఐటీయూ సెమినార్లో ప్రొఫెసర్ నిర్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికుల కోడ్లను తీసుకొచ్చి కార్మికులను చీల్చే కుట్రలో మోడీ సర్కార్ ఉందనీ, యూనియన్లు లేని పరిశ్రమలను అది ప్రోత్సహిస్తోందని ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్.నిర్మల విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సీఐటీయూ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎన్వీ భాస్కర్‌రావు 38వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 'లేబర్ కోడ్లు-కార్మికులపై ప్రభావం' అనే అంశంపై సెమినార్లో ఆమె మాట్లాడుతూ..స్వాతంత్రానికి పూర్వం నుంచి కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి అనుకూల చట్టాలను సాధించుకున్నదని తెలిపారు. అలాంటి చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మికులకు కనీస హక్కులను కాలరాసిందనీ, సంఘం పెట్టుకునే, బేరసారాలు ఆడే హక్కులు లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా గిగ్ వర్కర్స్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్, ఫిక్స్డ్ టర్మ్ వర్కర్స్‌ను చేర్చిందని విమర్శించారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితం కాకుండా కార్మికులను చీల్చుతున్నదని తెలిపారు. మోడీ సర్కారు పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతున్నదని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర కోశాధికారి జి. రఘుపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రాజారావు, ఎస్. వీరయ్య, జె.మల్లిఖార్జున్, వీఎస్.రావు, ఆర్. కోటంరాజు, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, జె.వెంకటేశ్, ఎస్వీ రమ, పద్మశ్రీ, బి.మధు, జె. చంద్రశేఖర్, బి. మల్లేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, పి. సుధాకర్, వై. సోమన్న, ఎం. చంద్రమోహన్, కుమారస్వామి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.