Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి రోజు కేదారీశ్వర వ్రతకల్పం
- రెండో రోజు ఎద్దుల విగ్రహ ప్రతిమల నిమజ్జనం
- మూడో రోజు బతుకమ్మ ఆటపాటలు
- చివరి రోజు గంగమ్మ ఒడికి గౌరమ్మ
నవతెలంగాణ-హసన్‌పర్తి
రాష్ట్రంలోనే ప్రత్యేకంగా హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో నిర్వహించే నేతకాని కులస్తుల బతుకమ్మ ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడ్రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బుధవారం కుటుంబ సభ్యులు కలిసి కేదారీశ్వరస్వామి వ్రతకల్పం నిర్వహిస్తారు. ఇదే రోజు ఊరు శివారులోని కుంటకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి జోడెద్దుల విగ్రహ ప్రతిమలను తయారు చేస్తారు. వాటిని కేదారీశ్వరస్వామి వ్రతకల్పం ముందు ఏర్పాటు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. గురువారం మగవారు మాత్రమే రకరకాల పిండి వంటలతో తయారు చేసిన నగల(నాగలి, కోల, ముల్లుకర్ర)ను జోడెద్దుల విగ్రహ ప్రతిమలకు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా ఊరు శివారులోని కుంటలో నిమజ్జనం చేస్తారు. శుక్రవారం రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి కేదారీశ్వరస్వామి వ్రతకల్పం ముందు గౌరమ్మను తయారు చేస్తారు. తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, పాడిపంటలు దండిగా పండాలని, అష్టఐశ్వర్యాలు కలగాలని కేదారీశ్వరస్వామిని వేడుకుంటారు. అనంతరం మగవారు కోలాటాలతో, ఆడవారు బతుకమ్మలతో ఊరేగింపుగా శివారులోని పెద్ద చెరువు ఆవరణకు చేరుకొని బతుకమ్మ ఆటపాటలతో సంబురాలు జరుపుకుంటారు. మహిళలు గౌరమ్మను వేడుకొని ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని బతుకమ్మ లను పెద్ద చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం వారు గంగ నీటిని తెచ్చి కేదారీశ్వరస్వామిని శుద్ధి చేసి నోము ముందు కూర్చొని సుంకుపట్టి ఉపవాస దీక్షను విడవడంతో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. ఈ పండుగకు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో స్థిరపడిన నేతకాని కులస్తులు సీతంపేటకు చేరుకొని పాల్గొంటారు.
ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రత్యేక ఏర్పాట్లు
దీపావళి బతుకమ్మ ఉత్సవాలకు వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి నేతకాని కులస్తులు, కుటుంబ సభ్యులు రెండ్రోజుల ముందే సీతంపేటకు చేరుకుంటారు. ఈ ఉత్సవాల కోసం వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. సర్పంచ్ జనగాం శరత్‌కుమార్, ఎంపీటీసీ బండారి రజితచేరాలు బతుకమ్మ ఆటస్థలం వద్ద ప్రత్యేక ఏర్పాట్ల కోసం కృషి చేస్తున్నారు.