Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకర్తల్లారా కదలిరండి.. : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
నికార్సైన కార్యకర్తల్లారా మునుగోడుకు కదలిరండి.. మీరే నా బలం.. సైన్యం.. కాంగ్రెస్‌ను చంపేందుకు ఇంటి దొంగలతోపాటు.. దేశ, రాష్ట్ర దొంగలు కుట్రలు పన్నుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఎనమూల రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ, మల్లారెడ్డిగూడెం, గుజ్జ గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలే బలమన్నారు. ఉప ఎన్నికల్లో ఓవైపు పోలీసులు.. మరోవైపు కేంద్ర బలగాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. ఉప ఎన్నికల్లో నరకాసురులను వధించాల్సిన అవసరముందని చెప్పారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ను చంపేందుకు ఇంటి దొంగలతోపాటు దేశ, రాష్ట్ర దొంగలు కొట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని వేలకోట్లకు అమ్ముకున్న దొంగ రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు ద్వారానే రాజగోపాల్ రెడ్డిని పాతాళనికి తొక్కాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాచకొండలో పేదలకు భూములు పంచితే కేసీఆర్, మోడీ ప్రభుత్వాలు వారికి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. అటవీ అధికారులతో కలిసి వేధింపులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదిన్నరేండ్లు పాలించిన ఈ పాలకుల వల్ల ప్రజలకు ఏమి ఒరిగిందో ప్రశ్నించుకోవాలన్నారు. పేదోడికి న్యాయం జరగకపోగా ధరల మీద ధరలు పెంచి ఇబ్బందులకు గురిచేసినట్టు వివరించారు. కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి పాల్వాయి స్రవంతి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి, నాయకులు గండ్ర సత్యనారాయణరావు, పున్న కైలాస నేత, చలమల కృష్ణారెడ్డి, వాంకుడత బుజ్జి, బంధువుల బాలకృష్ణ, ఎండి.అక్బర్ అలీ, ఏపూరి సతీష్, రాచకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.