Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాల అభ్యర్థులు డ్రామాలు ప్రారంభించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. గత నాలుగైదు రోజుల నుంచి తాను ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నానని అన్నారు. చివరకు అదే నిజమైందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, ప్రభాకరరావు తదితరులతో కలిసి తలసాని విలేకర్ల సమావేశం నిర్వహించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజల సానుభూతి కోసం చేతికి పట్టీలు, కాళ్లకు కట్లు కట్టుకున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అనేక నాటకాలాడారని తెలిపారు. ఇప్పుడు మునుగోడులో కూడా అదే తతంగం నడుస్తోందని విమర్శించారు. ఈ రోజు జ్వరం, రేపు దాడులంటూ ఏడుపులు, పెడ బొబ్బలు పెడతారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాటకాలు చూసి మోసపోవద్దంటూ మునుగోడు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.