Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 63,899 మందికి సీట్ల కేటాయింపు
- ఫార్మసీలో ఖాళీ సీట్లు 3,965
- ముగిసిన తుదివిడత కౌన్సెలింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్లో మంగళవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 177 ఇంజినీరింగ్ కాలేజీల్లో 79,346 సీట్లున్నాయని వివరిం చారు. వాటిలో 63,899 (80.53 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 15,447 (19.47 శాతం) సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నారు. 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,914 సీట్లుంటే 3,771 (76.73 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. వాటిలో 1,143 (23.27 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. రెండు ప్రయివేటు వర్సిటీల్లో 1,478 సీట్లకుగాను 1,074 (72.66 శాతం) మందికి సీట్లు కేటాయించామనీ, వాటిలో 404 (27.34 శాతం) సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నారు. 159 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 72,954 సీట్లుంటే, 59,054 (80.94 శాతం) మందికి కేటాయించామని వివరించారు. వాటిలో 13,900 (19.06 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు.
ఫార్మసీ కోర్సుల్లో 4,025 సీట్లుండగా, 60 (1.49 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇందులో 3,965 (98.51 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. 115 ఫార్మసీ కాలేజీల్లో 3,409 సీట్లకుగాను 36 (1.05 శాతం) మందికి కేటాయించామని పేర్కొన్నారు. ఇందులో 3,373 (98.95 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. ఫార్మా-డీకి సంబంధించి 56 కాలేజీల్లో 616 సీట్లుంటే, 24 (3.89 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇందులో 592 (96.11 శాతం) సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నారు. సరిపోయినన్ని వెబ్ఆప్షన్లు నమోదు చేయకపోవడం వల్ల 2,393 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించలేదని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కింద 5,185 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఒక యూనివర్సిటీ, 27 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28 నాటికి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతోపాటు చేరాలని సూచించారు.
సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లో మిగిలిన సీట్లు 3,256
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) అనుబంధ కోర్సుల్లో 49,031 సీట్లు అందుబాటులో ఉన్నాయని నవీన్ మిట్టల్ తెలిపారు. వాటిలో 45,775 (93 శాతం) మందికి సీట్లు కేటాయించామనీ, 3,256 (7 శాతం) మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అనుబంధ కోర్సుల్లో 18,825 సీట్లకుగాను 14,265 (76 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఇందులో 4,560 (24 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. సివిల్, మెకానికల్, అనుబంధ కోర్సుల్లో 10,286 సీట్లుంటే, 3,328 (32 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇంకా 6,958 (68 శాతం) సీట్లు మిగిలిపోయాయని వివరించారు. ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 1,204 సీట్లకుగాను 531 (44 శాతం) మందికి సీట్లు కేటాయించామనీ, ఇందులో 673 (56 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు.