Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన సంఘం వైస్ చైర్మెన్ పఠాన్ ఉమర్ ఖాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అఖిలభారత మూడో మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు మహాసభల ఆహ్వాన సంఘం వైస్ చైర్మెన్ పఠాన్ ఉమర్ ఖాన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నేరేడుమెట్‌లోని హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్స్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో మహాసభల బ్రోచర్‌ను సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. వెంకట్, ఎం అడివయ్యలతో కలిస ిఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమర్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్పీఆర్డీ అనేక ఉద్యమాలు చేస్తున్నదని తెలిపారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న వికలాంగుల వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అడివయ్య మాట్లాడుతూ చారిత్రాత్మకమైన తెలంగాణ గడ్డపై ఎన్పీఆర్డీ అఖిలభారత మూడో మహాసభలను డిసెంబర్ 26,27,28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. అఖిలభారత మహాసభల సందర్భంగా వికలాంగుల దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.వారి సమస్యలపై సెమినార్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.