Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వెనుక ఢిల్లీ స్థాయిలో ఎంత పెద్ద వారున్నా సరే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి కేసు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నేరుగా పీఠాధిపతులు, మతపెద్దలు రూ.కోట్లతో రంగంలోకి దిగడాన్ని ఆయన బుధవారం తీవ్రంగా ఖండించారు. దీన్ని చూస్తుంటే దేశంలో రాజకీయాలను బీజేపీ నడిపిస్తున్న తీరుకు అద్దం పడుతున్నదని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేకపోగా, మూడోస్థానంలోకి వెళ్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రహించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ఆ పార్టీ పని అయిపోయిందనే మైండ్ గేమ్‌ను ఆడేందుకు బీజేపీ కుట్ర చేసిందని విమర్శించారు. ఈ బేరసారాల్లో మతపెద్దలే ఉన్నారా లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఉన్నారా? అన్నది దర్యాప్తు చేసి తేల్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిజస్వరూపం బట్టబయలు కావాలనీ, సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలన్నీ ఆ పార్టీ ఆధీనంలో ఉన్నాయని విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.