Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న పాఠశాలల్లో నిరసన ప్రదర్శనలు
- నవంబర్ 13న హైదరాబాద్‌లో మహాధర్నా: టీఎస్‌యూటీఎఫ్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇతర సంక్షేమ గురుకుల పాఠశాలల మాదిరిగానే మహాత్మా జోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల బోధనా సమయాన్ని మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండేలా సమయాన్ని మార్చాలంటూ డిమాండ్ చేస్తూ ఈనెల 29న బీసీ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలనీ, భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. రెండో దశలో వచ్చేనెల 13న హైదరాబాద్ ధర్నాచౌక్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు ఆ సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టుకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి బుధవారం నోటీసును అందజేశారు.
నూతనంగా నెలకొల్పిన గురుకుల విద్యాసంస్థలన్నీ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. విద్యార్థులకు సరిపడిన మౌలిక వసతులు లేకపోవడంతో 90 శాతం పాఠశాలల్లో ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, పాఠశాలకు సిద్ధం కావడానికి ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు ఊరికి దూరంగా మూతపడిన ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహిస్తున్నందున ఉపాధ్యాయులకు వసతి లేదని పేర్కొన్నారు. ఇంకా సరైన రవాణా సౌకర్యం కూడా అందుబాటులో లేక ఉదయం 6.45 గంటలకే పాఠశాలకు రావటానికి కష్టమౌతున్నదని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం గురుకులాలతో సహా అన్ని విద్యాసంస్థల్లోనూ బోధనా సమయం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3ను 2015లోనే విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ మేరకు గత నాలుగేండ్ల నుంచి టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆయా సొసైటీల కార్యదర్శులకు, ప్రభుత్వానికి చేసిన ప్రాతినిధ్యాల మేరకు సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకులాల సమయాన్ని ఆగస్టులో మార్చారని వివరించారు. బీసీ గురుకులాల సమయాన్ని మారుస్తామంటూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి హామీ ఇచ్చినప్పటికీ సొసైటీ అధికారులు ఉత్తర్వులివ్వకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. గురుకుల ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన వేతనాలు అమలు చేస్తున్నందున, పని వేళలూ ఒకేలా ఉండేలా నిర్ణయించాలంటూ ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు కోరుతున్నారని తెలిపారు. బీసీ గురుకుల అధికారులు తక్షణమే పాఠశాలల పనివేళలను సవరిస్తూ ఉత్తర్వులిచ్చి ఉపాధ్యాయుల ఆందోళనను నివారించాలని కోరారు.