Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతకు కూనంనేని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ కుట్రలను ఎండగట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు యువతకు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం బుధవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశానికి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. దేశ సహజ వనరులను ఆయా శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని చెప్పారు. దీని కారణంగానే దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. 200కుపైగా ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయయనీ, దీంతో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువత ఉద్యోగాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న ప్రధాని మోడీ హామీలు ఏమయ్యాయయని ప్రశ్నించారు. కేవలం మాటల గారీడీ, హిందూత్వ పోకడలతో దేశంలోని యువతను నాశనం చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజాదరణ లేదన్నారు. అక్కడ వామపక్ష పార్టీలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, ఆఫీసు బేరర్లు నెర్లకంటి శ్రీకాంత్, లింగం రవి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.