Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 నుంచి తరగతులు ప్రారంభం
- ఈ విద్యాసంవత్సరం నుంచి ఏడు వర్సిటీల్లో అమలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో యూజీ (డిగ్రీ), పీజీ కోర్సులకు కామన్ అకడమిక్ క్యాలెండర్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల (ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలంగాణ మహిళా) పరిధిలో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఇది అమలు కానుంది. ఈ మేరకు డిగ్రీ మొదటి సెమిస్టర్, పీజీ మొదటి, మూడో సెమిస్టర్లకు సంబంధించి ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి కామన్ అకడమిక్ క్యాలెండర్ను బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి ఏడు వర్సిటీల పరిధిలో ఒకేసారి తరగతులు ప్రారంభం కావడంతోపాటు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ఈనెల పది నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు. డిసెంబర్ ఎనిమిది, తొమ్మిది తేదీల్లో మొదటి ఇంటర్నల్ అసెస్మెంట్, వచ్చేఏడాది జనవరి 23, 24 తేదీల్లో రెండో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి నాలుగు నుంచి ఎనిమిది వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణతోపాటు పరీక్షలకు సన్నద్ధమయ్యేమందుకు సెలవులుంటాయని వివరించారు. ఫిబ్రవరి తొమ్మిది నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈనెల 31 నుంచి పీజీ మొదటి, మూడో సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. డిసెంబర్ 22,23 తేదీల్లో మొదటి ఇంటర్నల్ అసెస్మెంట్, వచ్చేఏడాది ఫిబ్రవరి తొమ్మిది, పది తేదీల్లో రెండో ఇంటర్నల్ పరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణతోపాటు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సెలవులుంటాయని తెలిపారు. అదేనెల 27 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.