Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ !
- చంద్రబాబు మంత్రాంగం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యవర్గంలో భారీ మార్పులు రానున్నాయి. ఈమేరకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్ర బాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడినే మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు ఆ పార్టీ తెలంగాణ నేతల తో ఒక దఫా మంతనాలు పూర్తిచేశారు. ప్రస్తుత అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కనీ నర్సింహులును తప్పించి కొత్త నేతను ఎంపిక చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల టీడీపీలో తిరిగి చేరిన విషయం విదితమే. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగీతీ తెలిసిదే. నాలుగేండ్లుగా శాసన మండలి సభ్యుడిగా సేవలందించారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్‌గా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. మనపార్టీని స్థాపించిన జ్ఞానేశ్వర్ ఆతర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కాగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తు న్నారు. దీంతో జ్ఞానేశ్వర్‌కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈమేరకు కాసానికి ఇచ్చిన హామీ మేరకే వారం రోజుల క్రితం టీడీపీలో చేరారు. జ్ఞానేశ్వర్ అనుచరుల సమాచారం ప్రకారం నవంబరు 10న ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే బుధవారం చంద్రబాబు విజయవాడ వెళుతూ బేగంపేట ఏయిర్‌పోర్టులో ప్రస్తుత అధ్యక్షులు బక్కనీ నర్సింహులు తో మంతనాలు చేసినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ అవసరాలు, బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించే అంశాన్ని కూడా నర్సింహులుతో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం.