Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్వయిజరీ బోర్డు స్పష్టీకరణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయటం సరైనదేనని పీడీ చట్టం అడ్వయిజరీ బోర్డు బుధవారం స్పష్టం చేసింది. తన భర్త రాజాసింగ్‌పై పీడీ చట్టాన్ని ప్రయోగించటం సరైంది కాదనీ, ఆయనపై ఆ చట్టం మోపటానికి తగిన ఆధారాలు లేవనీ, కాబట్టి ఆ చట్టం నుంచి తన భర్తను విముక్తుణ్ణి చేయాలంటూ రాజాసింగ్ భార్య పీడీ చట్టం అడ్వయిజరీ బోర్డుకు నివేదించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో మరో ఇద్దరు రిటైర్డ్ జడ్జిలు సభ్యులుగా ఉన్న అడ్వయిజరీ బోర్డు రాజాసింగ్ భార్య తన పిటిషన్లో పేర్కొన్న అంశాలు ఏవీ సంతృప్తికరంగా లేవంటూ బోర్డు ఆమె పిటిషన్‌ను తిరస్కరించిందని నగర పశ్చిమ మండలం డీసీపీ జోయెల్ డేవిస్ నవతెలంగాణతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 24న ఒక వర్గం ప్రజల మత విశ్వాసాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానాలున్నాయంటూ షాహినాయత్‌గంజ్ పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, గతంలో సైతం మత విశ్వాసాలు దెబ్బతినేలా రాజాసింగ్ వ్యాఖ్యానాలు చేశారంటూ మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. వీటిన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్‌పై ప్రివెన్షెన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం కింద నగర పోలీసు కమిషనర్ కేసు నమోదు చేయటమే గాక ఆ చట్టం ఆధారంగా చర్లపల్లి జైలుకు తరలించారు. రాజాసింగ్‌ను అరెస్టు చేసిన రోజే బీజేపీ నాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయటమేగాక, పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించ కూడదో నెల రోజుల్లో తెలపాలంటూ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే, తన భర్తపై అక్రమంగా పీడీ చట్టాన్ని ప్రయోగించారనీ, దాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ రాజాసింగ్ భార్య పీడీ అడ్వయిజరీ బోర్డును కోరటమే గాక హైకోర్టుకు సైతం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సాగుతుండగా అడ్వయిజరీ బోర్డు మాత్రం రాజాసింగ్ భార్య వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.